Nidhi Agarval: ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్‌గా అనిపించింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాడే యోధుడిగా పవన్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిధి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

నేను వాడిన జ్యుయలరీ అంతా గోల్డే..

‘హరి హర వీరమల్లు’లో పంచమి అనే శక్తివంతమైన పాత్రలో నటించాను. నాకు, పవన్ కల్యాణ్ గారికి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. నా పాత్రకు తగ్గట్టుగా దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమాలో నేను వాడిన జ్యుయలరీ అంతా గోల్డే. ప్రతిక్షణం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఏ చిన్న వస్తువు మిస్ అయినా కూడా బంగారం కదా చాలా ఇబ్బంది అవుతుంది. పవన్ కల్యాణ్ గారితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. చాలా పుస్తకాలు చదివారు. ఈ సినిమా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఆర్టిఫిషియల్ అనిపించదు. అసలు సెట్ చేయడం కూడా అన్నీ అలాగే సెట్ చేశారు.

ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్‌గా ఉంటారు..

ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్‌కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది. పవన్‌తో పాటు ‘రాజాసాబ్’లో ప్రభాస్‌ గారితో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్‌గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. చాలా సాఫ్ట్ నేచర్. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్. ఈ సినిమాలో తార తార, కొల్లగొట్టినాదిరో గీతాలు నాకు బాగా నచ్చాయి.

ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్..

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో భరతనాట్యం కోసం చేసే సన్నివేశం నాకు చాలా కష్టంగా అనిపించింది. భరతనాట్యం సీన్ కోసం నేను హెవీ కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చింది. దానికి తోడు జ్యుయలరీ.. పూలజడ అన్నీ చాలా అందంగా అలంకరించారు. కదిలితే ఎక్కడ ఏదైనా పాడవుతుందేమోనని నేను కనీసం వాష్ రూమ్ కూడా యూజ్ చేసుకోలేకపోయాను. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిధి అగర్వాల్ తెలిపింది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *