బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ఈ సినిమాను కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని పోస్టర్ కలిగించింది.
తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు (జూన్ 12) ఉదయం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్లో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా పోటాపోటీగా నవ్వులు పంచారు. క్రికెట్ తరహా కామెంటరీతో టీజర్‌ను వినోదభరితంగా మలిచిన తీరు ఆకట్టుకుంది. “బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు.. రోజూ ఎవరో ఒకర్ని ఎర్రిపప్పని చేస్తారు” అంటూ ప్రధాన పాత్రధారులు ఎలాంటి హాస్యాన్ని పంచబోతున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇక టీజర్ లో వెన్నెల కిషోర్, సత్య మధ్య కామెడీ డైలాగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ ‘మిత్ర మండలి’ టీజర్.. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.