సెలబ్రిటీలు దేనిపైనైనా స్పందించినా ఇబ్బందే.. స్పందించకున్నా ఇబ్బందే. స్పందిస్తే ఒకలా.. స్పందించకుంటే మరోలా వార్తలు బయటకు వస్తుంటాయి. తాజాగా కీర్తి సురేష్ ఒక విషయమై స్పందించకపోవడంతో మౌనం అర్థంగీకారం అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలు కీర్తి దేనిపై స్పందించలేదు? ఏం జరిగింది? చూద్దాం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్‌గానూ ఎన్నో సినిమాలు చేసింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. టాలీవుడ్‌లోకి ‘నేను శైలజ’ చిత్రంతో అడుగు పెట్టిన కీర్తి.. ఆ తరువాత ఎన్నో చిత్రాలు చేసింది. ‘మహానటి’తో ఆమె రేంజే మారిపోయింది.
ఇటీవలే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే కీర్తి తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి హజరైన అతిథుల్లో విజయ్ దళపతి ఒకరు. కట్ చేస్తే తాజాగా కీర్తి మధురై వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన వారంతా ‘టీవీకే టీవీకే’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. టీవీకే అనేది విజయ్ దళపతి పెట్టిన పార్టీ పేరు. గతంలో విజయ్‌తో కలిసి కీర్తి రెండు సినిమాలు చేసి ఉండటం.. ఆమె పెళ్లికి విజయ్ హాజరవడంతో ఈ స్లోగన్స్ చేశారు. అయితే వీటిపై కీర్తి పెదవి విప్పలేదు. వినేసి ఊరుకుంది. ఇక అంతే.. కీర్తి రాజకీయాల్లోకి రానుందని.. విజయ్ పార్టీ కండువా కప్పుకోనుందంటూ ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓ సందర్భంలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని కీర్తి చెప్పిన విషయాన్ని సైతం పక్కనబెట్టేసి మరీ ప్రచారం చేస్తున్నారు.