కరోనా తరువాత ఎందుకోగానీ గుండె జబ్బులు బాగా పెరిగిపోయాయి. గతంలో అరవైల్లో వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు ఇరవైల్లోనే వెంటాడుతున్నాయి. మన దేశంలో ఏటా దాదాపు రెండు కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు అంచనా. గుండె పదిలంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. ముందుగా ఏ ఏ కారణాలు గుండె జబ్బులకు దారి తీస్తాయో తెలుసుకుందాం. హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని వైద్యులు చెబుతారు. దాదాపు 75 శాతం మరణాలు ఈ హైబీపీ కారణంగానే వస్తుంటాయి. దీనిని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే డయాబెటిస్. ఇది కూడా గుండె జబ్బులకు ఒక కారణమే. దీనిని కూడా నిత్యం పరీక్ష చేయించుకుంటూ అదుపులో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ వంటివి కూడా ప్రమాదకరమే.
గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేయాలి. లిఫ్ట్‌కు బదులుగా వీలైనంత మేర మెట్లను వాడాలి. ఎప్పుడూ ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒకసారైనా లేచి ఒక పది నిమిషాల పాటు నడవాలి. సామర్థ్యం మేరకు జాగింగ్ చేస్తే మరీ మంచిది. సైక్లింగ్, యోగ, తోటపని వంటివి నిత్యం చేస్తూ ఉంటే గుండె జబ్బులు దరి చేరవు. ఇక పొగ తాగే అలవాటున్నవారు దానికి దూరంగా ఉండాలి. చక్కగా రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ గుండెకే కాదు.. బీపీ, షుగర్ వంటి వాటిని కూడా అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి.