KCR :
హ్యాట్రిక్ పై ఎంతో నమ్మకంతో ఉండి.. తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు అధినేత కేసీఆర్ గాయపడడం మరో పెద్ద దెబ్బగా మారింది.
పదేళ్ల తర్వాత ప్రతిపక్ష బాధ్యత.. (అది కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొలిసారి) నిర్వర్తించాల్సిన పరిస్థితి.
గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాలను తవ్వే వ్యవహారం కొంతకాలంగా దేశ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఆ నిర్ణయాల్లో తప్పు, ఒప్పును పక్కనపెడితే.. ముందు వాటిని సమీక్షించే నెపంతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టొచ్చు.
వారెవరూ కాదు..
ఈయన ప్రతిపక్షంలో ఉండడం బీఆర్ఎస్ కు కొత్త కాదు. 2001 నుంచి 2014 వరకు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించింది.
అనంతరం దాదాపు పదేళ్లు అధికారంలో కొనసాగింది. కాగా.. గతం 23 ఏళ్లుగా బీఆర్ఎస్ గళం అంటే.. కేసీఆర్ ఆయనకు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు.
మంచి వాగ్ధాటి, చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వీరి ప్రత్యేకత. దీంతోనే ఉద్యమంలో ప్రజల మద్దతు పొందారు.
అయితే, పదేళ్లు అధికారంలో ఉన్నాక.. ప్రతిపక్షానికి పరిమితం అయిన ప్రస్తుత పరిస్థితుల్లో గళం విప్పేందుకు పరోక్షంగా మరొక నేతను ఎంచుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఆరోపణల్లేని ఆయనే సరైనోడు?
తెలుగుదేశం ఆపై బీఆర్ఎస్ లో పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, డిప్యూటీ సీఎంగానూ పనిచేసిన నాయకుడు కడియం శ్రీహరి.
ఎంత కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు. స్టేషన్ ఘనపూర్ నుంచి ఈసారి గెలుపొందిన కడియం శ్రీహరి ప్రస్తుతం బీఆర్ఎస్ వాయిస్ గా ఉన్నారు.
పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చడం, కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలు, గత ప్రభుత్వ నిర్ణయాలకు సమర్థన.. ఇలా ఏ అంశమైనా కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గళం వినిపిస్తున్నారు.
దీనిని చూస్తుంటే.. మున్ముందు శ్రీహరినే ముందుపెట్టి వ్యూహాత్మకంగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయినా.. మరే పార్టీకీ లేనంతగా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత మంచి వక్తలున్న బీఆర్ఎస్ లో వీరెవరూ కాకుండా.. అందులోనూ వారి కుటుంబ వ్యక్తి ఎవరూ కాకుండా.. కడియం శ్రీహరి బీఆర్ఎస్ వాయిస్ గా మారడం అనూహ్యమే.
అయితే, ఇక్కడే వ్యూహం కూడా ఉంది. కడియం శ్రీహరి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. సుదీర్ఘ అనుభవానికి తోడు నిజాయతీ ఆయన సొంతం. ఇదేకాక.. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవారు.
వీటిన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం.. కడియం సేవలను వినియోగించుకోవాలని భావించినట్లు కనిపిస్తోంది.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?