నవీన్ పొలిశెట్టి.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తెలుగులో ‘మిస్టర్ అండ్ మిసెస్ పొలిశెట్టి’ తర్వాత ఆయన నటించిన ఏ చిత్రం కూడా విడుదల కాలేదు. మరి స్క్రిప్ట్స్ ఆయన దగ్గరకు వెళ్లడం లేదో.. లేదంటే ఆయనే దూరంగా ఉంటున్నారో కానీ చాలా గ్యాప్ అయితే వచ్చింది. వాస్తవానికి నవీన్ పొలిశెట్టి చిత్రాలన్నీ మంచి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ‘సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరోకి అద్భుతమైన అవకాశం వచ్చిందని టాక్.
మనం ఓ యాడ్ చూస్తుంటాం. ‘లడ్డూ కావాలా నాయనా.. మరో లడ్డు కావాలా?’ అంటూ.. ప్రస్తుతం నవీన్ పరిస్థితి కూడా ఇదే. ఒకటి కాదు.. రెండు మాంచి నేతి లడ్డూలు దక్కబోతున్నాయని టాక్. అందులో మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వరించనుందట. మొత్తానికి ప్రచారం అయితే జోరుగానే సాగుతోంది. ఆయన చిత్రాలన్నీ ఎవర్‌గ్రీన్. ప్రస్తుతం కమల్‌హాసన్, శింబు, త్రిషలతో ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 5న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీని తర్వాత మణిరత్నం ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చేయనున్నారట. దీనిలోనే నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుందట. మరి రెండో లడ్డూ ఏంటంటారా? ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట. ఇదే నిజమైతే నవీన్ పొలిశెట్టికి మహర్దశ పట్టినట్టే.