ప్రస్తుత తరుణంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. 40 దాటిందా.. దాదాపుగా అంతా డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనికి కారణం జన్యు సంబంధిత సమస్య కానీ… మన ఆహారపు అలవాట్లు కావొచ్చు. కానీ ఇది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితకాలం వేధిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు డయాబెటిస్ వస్తుంది. అసలు డయాబెటిస్ ఉన్నవారిలో చాలా మందికి ఇది ఉన్నట్టుగా కూడా తెలియదు. దీనిని అదుపులో ఉంచుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. వైద్యుడి సూచన మేరకు మెడిసిన్ సరిగ్గా వాడుతూనే.. ఎక్సర్‌సైజ్ వంటివి చేయాలి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ కారణంగా గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది కాబట్టి దీనిని అదుపులో ఉంచుకోవాల్సిందే. ప్రస్తుత తరుణంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ సంభవిస్తోంది. దీనికి కారణం.. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడమే. అయితే కొన్ని లక్షణాల కారణంగా మనం డయాబెటిస్‌ను గుర్తించవచ్చు. అధికంగా దాహం వేయడం, అధిక మూత్ర విసర్జన, ఇట్టే అలసిపోవడం, బరువు తగ్గిపోవడం, తరచుగా గాయాలవడం, అవి మానకపోవడం.. చూపులో స్పష్టత తగ్గిపోవడం వంటి లక్షణాలుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు.. చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండేవారు ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు.