ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత మంది డాక్టర్ల వద్దకు తిరిగినా జుట్టు రాలిపోతూనే ఉంది. కొందరైతే దీనిని పెద్ద సమస్యగా చూడరేమో కానీ ముఖ్యంగా లేడీస్ జుట్టు రాలడాన్ని తీవ్రమైన సమస్యగానే పరిగణిస్తారు. ఆందోళన చెందుతారు. డాక్టర్ల వద్దకు వెళ్లినా కూడా మెడిసిన్ ఇచ్చి పంపించేస్తారే తప్ప అసలు జుట్టు ఎందుకు రాలుతోంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన వివరణ మాత్రం ఇవ్వరు. జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు.. విటమిన్ లోపంతో పాటు తల్లిదండ్రులు, తాతలకు ఈ సమస్య ఉండటం, వంటివి ముఖ్య కారణాలు. స్ట్రెస్, నిద్రలేమి, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్, పోషకాహార లోపం వంటివి ఇతర కారణాలు.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా జుట్టు పెరగడానికి సహాయపడే పోషకాలు. సమతుల్య ఆహారం తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో జింక్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమపాళ్లలో ఉండాలి. అంటే మన డైట్‌లో ఎక్కువగా ఆకుకూరలు, గుడ్లు, చేపటలు, నట్స్ వంటివి తీసుకుంటే అన్ని పోషకాలు చక్కగా అందుతాయి. అలాగే మనం దువ్వుకునే దువ్వెన సైతం జుట్టుపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి వెడల్పైన పళ్లున్న దువ్వెనను వినియోగించాలి. హెయిర్ డ్రైయర్స్, స్ట్రైట్‌నర్స్ వాడకం తగ్గించాలి. షాంపూ, కండీషనర్స్ వంటివి కెమికల్స్ లేనివి చూసుకుని వాడాలి.