బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టును లైన్‌లో పెట్టే పనిలో ఉన్నారు. ‘మహాభారతం’ను కొన్ని సిరీస్‌లుగా తెరకెక్కించాలని అమీర్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు నటీనటులను ఎంపిక చేసే పనిలో కూడా అమీర్ ఖాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘మహాభారతం’ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. ఆయనకు ఏ సినిమాకైనా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తూ ఉంటారు.
అలాంటి విజయేంద్ర ప్రసాద్‌ను ‘మహాభారతం’ ప్రాజెక్ట్ విషయంలో అమీర్ సైతం సంప్రదించారు. ఇక మహాభారతంలో స్టార్ క్యాస్ట్‌ను అమీర్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీ కృష్ణుడు పాత్రకు తననే ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలిన కీలక పాత్రల కోసం కూడా వివిధ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే అర్జునుడి క్యారెక్టర్ విషయంలో ఓ స్టార్ హీరోని సంప్రదించారట. ఆయన మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే అల్లు అర్జున్‌ను అమీర్ కలిశారని.. ఆ క్యారెక్టర్‌లో నటించేందుకు బన్నీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అమీర్ ఖాన్ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.