Hari Hara Veeramallu: చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది

ఒక సినిమా కోసం ఐదేళ్ల పాటు ఎదురు చూడటమంటే సాధారణ విషయం కాదు.. వేరొక హీరో అయితే జనాలంతా మరచిపోయి ఉండేవారేమో కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కదా.. అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. జూలై 24న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఎం.జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

జూలై 3(గురువారం) హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రైలర్‌లో అణువణువునా దర్శకత్వ ప్రతిభ కనిపించింది. దర్శకుడు జ్యోతి కృష్ణ చారిత్రక కథకు తగ్గట్టుగా చిత్రానికి భారీతనాన్ని తీసుకొచ్చారు. ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా వీరమల్లు-మొఘలుల మధ్య యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బలం, శక్తికి చిహ్నంగా చిత్రాన్ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే, వీరమల్లు పాత్రకు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, అందరూ ఆకర్షితులయ్యేలా తీర్చిదిద్దారు. పంచమి పాత్రలో నిధి అగర్వాల్ చక్కగా ఒదిగిపోయారు. ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ వి.ఎస్.మనోజ్ పరమహంస సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు.

ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి తన అద్భుతమైన సెట్‌‌లతో ప్రేక్షకులను మొఘల్ యుగంలోకి తీసుకువెళ్లారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తన నేపథ్య సంగీతంతో ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. ప్రవీణ్ కె.ఎల్.ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. “చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు చేసిన పూర్తిస్థాయి పాన్ ఇండియా యాక్షన్ చిత్రమిది. మీ ఆనందం చూస్తుంటేనే.. ట్రైలర్ మీ అంచనాలకు మించి ఉందని అర్థమవుతోంది. సినిమా ఇంతకుమించి ఉంటుంది. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి నా కుమారుడు జ్యోతికృష్ణ ఎంతగానో శ్రమించాడు. ఇప్పటిదాకా మీరు పవర్ స్టార్‌ను చూశారు. ఈ సినిమాలో రియల్ స్టార్‌ను చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలోనే కాదు.. నిజజీవితంలోనూ రియల్ హీరో” అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *