పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా ఈ సినిమాలో పవన్ కనిపించనున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఎం రత్నం మీడియాతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిపారు. పవన్ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని ముందు రోజు రాత్రి నుంచే షోలు వేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘హరి హర వీరమల్లు’’ అనేది 17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము. నా సినీ జీవితంలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించా కానీ సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా మాత్రం ఇదే. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. మొదట ఈ సినిమాను రెండు భాగాలని అనుకోలేదు. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువ మందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది. జూలై 24 తెల్లవారుజాము నుంచే షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము’’ అని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల