మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికే విడుదలవ్వాల్సి ఉంది కానీ అప్పుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా పడింది. ఇక ఆ తరువాత ఇప్పటి వరకూ సినిమా రిలీజ్ డేట్‌నే మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్‌ను దర్శకుడు వశిష్ట చెప్పేశారు. వశిష్ట ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘‘భూమికి పైన 7, కింద 7 కలిపి మొత్తంగా మనకు 14 లోకాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పటి వరకూ ఎవరికి తోచిన విధంగా వారు చూపించారు. అయితే యమలోకం, స్వర్గ లోకం, పాతాళలోకం.. వరకూ మనం కొన్ని సినిమాల్లో చూసేశాం. విశ్వంభరలో వాటన్నిటినీ దాటి పైకి వెళ్లడం జరిగింది. 14 లోకాలకు బేస్ అయిన బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించడం జరిగింది. హీరో డైరెక్ట్‌గా సత్యలోకానికి వెళ్లి హీరోయిన్‌ను ఎలా తీసుకొస్తాడనేది కథ’’ అని వశిష్ట వివరించారు. ఈ సినిమా కోసం వాస్తవికతను తలపించేలా సెట్స్ వేస్తున్నట్టు గతంలోనే వశిష్ట తెలిపారు. ఇక ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.