france moment :
ఆదివారం ఇద్దరు యువతులు పారిస్‌లోని లోరే మ్యూజియాన్ని సందర్శించడానికి వచ్చారు. ఉన్నట్టుంది అక్కడి ప్రఖ్యాత మోనాలిలా చిత్రపటంపై తమ వెంట తెచ్చుకున్న సూప్‌ను చల్లారు.
‘‘మా రైతులు పొలాల్లో చనిపోతున్నారు. మనకు ఏది ముఖ్యం? కళలా.. ఆహారమా’’ అని నినాదాలు చేశారు.
ఇంతకీ ఆ మహిళలు ఎవరు.. మోనాలిసా చిత్రపటంపై సూప్ చల్లడానికి కారణమేంటి..ఫ్రాన్స్ లో రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు.
మోనాలిసా చిత్రపటంపై సూప్ చల్లిన ఇద్దరు యువతులు పర్యావరణ కార్యకర్తలు. అంతర్జాతీయ స్థాయి పర్యావరణ సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు.
మోనాలిసా చిత్ర పటంపై సూప్ చల్లడం ద్వారా ఫ్రాన్స్ లో రైతు ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తమ ఉద్దేశంగా చెప్పారు. సూప్ చల్లిన వెంటనే అప్రమత్తమైన మ్యూజియం సిబ్బంది సందర్శకులను ఖాళీ చేయించారు. యువతులను పోలీసులు అరెస్టు చేశారు.
ఫ్రాన్స్ లో రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు?
మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమం గుర్తు ఉందా? పంటకు మద్దతు ధర ఇవ్వాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలి వచ్చి ఏడాదిపాటు ఉద్యమం చేశారు.
రోడ్లను బ్లాక్ చేశారు. ఫ్రాన్స్ లో కూడా రైతులది అదే సమస్య. తమ పంట ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విదేశాల నుంచి చవకైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిగుమతులను తగ్గించాలని కోరుతున్నారు. ఈ నెల రెండో వారంలో ప్రారంభమైన నిరసనలు దేశమంతటా విస్తరించాయి. అన్ని ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్లను రోడ్లకు అడ్డం పెట్టి బ్లాక్ చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ చర్యలపై కూడా ఆందోళన
ప్రపంచమంతా ఇప్పుడు పర్యావరణ పరిరక్షణపై ద్రుష్టి సారించిన సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం కోసం వాటిపై పన్నులను అనేక దేశాలు పెంచుతున్నాయి.
ఫ్రాన్స్ లొ డీజిల్ పై పన్నును పెంచారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధర పెరగడం వల్ల పంట ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని వాపోతున్నారు.
దీంతో పాటు వ్యవసాయ సాంకేతిక విధానాలను కూడా సరళీకరించాలని వారు కోరుతున్నారు. ఫ్రాన్స్ లో కేవలం 3శాతం జనాభానే వ్యవసాయంపై ఆధారపడ్డారు.
కానీ, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో ఫ్రాన్స్ దేశమే అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారు.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?