మీకోసం మీరు నిలబడకుంటే.. ఎవరూ నిలబడరు..

అచ్చతెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా, పృథ్వీ అంబర్ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. నేను రాసి, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయి ఉంటాడు. అలా నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతోనే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు’’ అంటూ అమ్మాయిలకు ఒక సందేశాన్ని సైతం ఇచ్చింది.

పృథ్వీ అంబర్ మాట్లాడుతూ .. ‘మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది’ అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కరోనా టైంలో సుమయ రెడ్డి గారు రాసిన కథ నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. చివరకు సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు’’ అని అన్నారు. కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ .. ‘‘ సుమయా రెడ్డి గారు ఇచ్చిన కథ నిజంగానే అద్భుతం అయితే దానిని మరింత అద్భుతంగా తీశారు. అప్పట్లో హాస్పిటల్ వ్యవస్థను చూపించిన వెంకటేష్ బాబు గణేష్ సినిమా అందరికీ గుర్తుండి పోతుంది. ‘డియర్ ఉమ’ చిత్రంలోనూ అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *