మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా అయితే ప్రకటించేశారు. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసే, నటించే వారందరినీ కూడా ఓ కాన్సెప్ట్‌తో పరిచయం చేశారు. మరి అంతా ఓకే కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు? అని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కోసం సైడ్ అయిపోయింది. అప్పటి నుంచి చిత్రం విడుదలపై ఏవో ఊహాగానాలు తప్ప అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఈ సినిమా విడుదల తేదీ తెలిస్తే కానీ చిరు-అనిల్ రావిపూడి కాంబో చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయమై క్లారిటీ రాదేమోనని నిన్న మొన్నటి వరకూ అంతా భావించారు. అయితే చిరు మాత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీతో సంబంధం లేదని.. అనిల్ రావిపూడి ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా ఓపెనింగ్ వీడియోనే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో సినిమా మరింత ఆసక్తికంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరుతో సినిమా ప్రకటనే ఈ రేంజ్లో చేస్తే.. ఆయన సెట్స్ మీదకు వెళ్లాక అనిల్ రావిపూడి ఇంకెంత హడావుడి చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు మే 22 నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని టాక్. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.