Congress Hyderabad : సీఎం వ్యూహం.. హైదరాబాద్ ను ‘హస్త’గతం చేసుకోవాల్సిందే

Congress Hyderabad :

మొన్న బీఆర్ఎస్ కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్.. నిన్న మాజీ మేయర్.. ఇద్దరూ ఒకే తరహాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరలేదు. ఇక కిందిస్థాయిలో పలువురు నాయకులు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు.. హైదరాబాద్ శివారులోని కొన్ని కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు ఇదే బాటలో ఉన్నారు. అయితే, మిగతావారు వెళ్లడం ఒక ఎత్తు.. మాజీ మేయర్ ఆయనతో కలిసి డిప్యూటీగా పనిచేసిన వ్యక్తి వెళ్లడం వేరు. దీనివెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది. హైదరాబాద్ ను హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నం ఉంది.

ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదు..

ఇటీవలి ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీకి రాజధానిలో ప్రాతినిధ్యం లేకపోవడం అంటే విచిత్రమే. కచ్చితంగా గెలుస్తాం అనుకున్న నాంపల్లి వంటి సీటు కూడా రాలేదు. రాష్ట్ర జనాభాలో పావు వంతు భాగం ఉన్న హైదరాబాద్ పరిసరాల్లో ఒకటీ రెండు సీట్లు మాత్రమే నెగ్గడం కాంగ్రెస్ పార్టీ గెలుపును ఒకవిధంగా తక్కువచేయడమే. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ రాజధానిలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది.

వారిద్దరినీ గుంజేసి..

హైదరాబాద్ లో 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2016, 2021లో మాత్రం దారుణ ఫలితాలను ఎదుర్కొంది. పదేళ్లలో కీలక నాయకులు వెళ్లిపోవడం, కేడర్ చెదిరిపోవడంతో ఇప్పటికీ ఆ పార్టీకి నగరంలో పెద్దగా పట్టులేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. రాజధాని కూడా వారి కనుసన్నల్లో ఉండాలి. అలాగైతేనే చేపట్టే కార్యక్రమాలకు అడ్డు ఉండదు. సరిగ్గా ఆ దిశగానే పావులు కదుపుతోంది ఇప్పుడు. హైదరాబాద్ లో 2016-21 మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ గా పనిచేశారు బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బీఆర్ఎస్ అధిష్ఠానానికి సన్నిహితులుగా ఉన్నారు. అలాంటి వీరు తాజాగా కాంగ్రెస్ సీఎం రేవంత్ ను కలిశారు. త్వరలో ఇద్దరూ అధికార పార్టీలో చేరడం ఖాయమనే అభిప్రాయం కూడా వస్తోంది. వీరే కాదు.. మరికొందరు కార్పొరేటర్లు, నాయకులు.. ఆఖరికి ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ లోకి వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల వరకు కొందరు.. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మరికొందరు హస్తం గూటికి చేరడం తథ్యమని చెబుతున్నారు. మొత్తానికి.. హైదరాబాద్ ను గుప్పిట పట్టేందుకు పై స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తూ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను ఇలా ముమ్మరం చేసింది.

 

Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *