BRS Party :
అధికారం పోయింది.. అక్రమాలు బయటికొస్తున్నాయి.
ఔను.. తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్న భూకబ్జాల వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పాత్రే ఉన్నట్లు తెలుస్తోంది.
స్నేహితులు, బంధువులు.. ఇలా ఒక్కొక్క చోట కబ్జా వెనుక ఒక్కొక్కరి పాత్ర ఉన్నట్లు ఆధారాలతో సహా వెల్లడవుతోంది.
జీవో నంబరు 59ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమిని తన వారికి పంచిపెట్టి క్రమబద్ధీకరించిన వ్యవహారం హైవే పక్కన సర్వీస్ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించిన వ్యవహారం,
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులిచ్చి నజరానా పొందిన వ్యవహారం.. ఇల చెప్పుకొంటూ పోతే ఎన్నెన్నో అక్రమాలు.
పదేళ్లపాటు అధికారంలో బీఆర్ఎస్ అప్రతిహతంగా కొనసాగడంతో అడిగేవారు, ప్రశ్నించేవారు లేక, అడిగినా పట్టించుకునేవారు లేక.. ఆ నేత ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచింది.
ముచ్చటగా మూడోసారి కూడా అధికారం తమదేనన్న ధీమాతో మరిన్ని అక్రమాలు, భూకబ్జాలకు గేట్లు తెరుస్తూ తన అనుయాయులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
ఇదే అదనుగా హైదరాబాద్ నగర శివారులోని ఖరీదైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కొల్లగొట్టే పనిలో ఆ నేత సైన్యం నిమగ్నమైంది. ప్రతిపక్షాలు, పత్రికలు ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చినా.. తన అధికార బలంతో వాటిని అణగదొక్కేశారు.
వాస్తవానికి ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించవద్దన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలను బలహీనపరుస్తూ వచ్చారన్నది కాదనలేని నిజం. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
పరిస్థితులు తలకిందులయ్యాయి. ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో గద్దె దిగాల్సివచ్చింది.
అయినా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ ఆ పార్టీ గెలుచుకోవడం వెనుక ఈ భూమాఫియానే అన్న అభిప్రాయాలున్నాయి.
మేకపోతు గాంభీర్యమే
తమ భూకబ్జాల సామ్రాజ్యం కూలిపోకుండా కాపాడుకునేందుకు ఆ కీలక మంత్రి స్వయంగా గ్రేటర్ పరిధిలోని స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఆయన వ్యూహం ఫలించి అన్ని స్థానాలనూ గెలుచుకున్నా.. గ్రామీణ ప్రాంత ప్రజల నిర్ణయం వ్యతిరేకంగా రావడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
అధికార పీఠం దూరం కావడంతో తమ కబ్జాల సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందోనన్న భయం ఆ నేతకు పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిరోజే.. ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు.
తద్వారా కాంగ్రెస్ ను కొంత భయపెట్టడంతోపాటు తమ కబ్జాల సైన్యానికి ధైర్యాన్నివ్వడం కూడా ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ, ఇలాంటిదేమీ జరగకపోగా.. సదరు మాజీ మంత్రి సైన్యం చేసిన కబ్జాలు రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. అయినా.. ఇప్పటిదాకా ఆ మాజీ మంత్రి వీటిపై నోరు కూడా మెదపడంలేదు.
పైగా పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షల పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ.. రోజుకో రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు చూసినవారంతా అది మేకపోతు గాంభీర్యమేనంటున్నారు.
ఆ పార్టీ అధినేత ప్రమాదవశాత్తూ గాయపడి, శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటుండడంతో.. పార్టీలో ఆ నేతే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
ఆ మాటకొస్తే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆ నేత చేతుల్లోనే అధికారం అంతా ఉందన్న టాక్ నడిచింది. అదే ఆ పార్టీ కొంపముంచిందని అనేవారూ లేకపోలేదు.
ఇప్పుడు బయటికి వస్తున్న అక్రమాలపై ఆయన స్పందించినా, స్పందించకపోయినా.. వాటిపై ప్రభుత్వం జరిపే విచారణ ఏదో ఒకరోజు ఆయన దాకా రాకుండా పోదు. మరి అప్పడు కూడా స్పందించకుండా ఎలా తప్పించుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?