టాలీవుడ్‌లో మరో విషాదం.. ఫిష్ వెంకట్ కన్నుమూత

టాలీవుడ్‌‌లో మరో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి ఫిష్‌ వెంకట్‌ (53) కన్నుమూశారు. ఈ నెలలో తొలుత కోటా శ్రీనివాసరావు ఆ వెంటనే బి. సరోజా దేవి.. ఆ తరువాత రవితేజ తండ్రి మరణించి కొద్ది రోజులు కూడా గడవకముందే ఫిష్ వెంకట్ కన్నుమూతతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఆయనకు రోజూ డయాలసిస్ చేస్తున్నారు. కానీ షుగర్, బీపీలు కంట్రోల్ కాకపోవడంతో ఇతర ఆర్గాన్స్ సైతం దెబ్బతిన్నాయి. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్టు ఆయన కుమార్తె మీడియాకు తెలిపారు. వైద్య సేవల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడంతో దాతల సాయం కోరారు. ఇంతలోనే ఫిష్ వెంకట్ మృతి చెందడం బాధాకరం.

వందకు పైగా చిత్రాల్లో ఫిష్ వెంకట్ నటించారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులకు దగ్గరయ్యారు. ఆయన చివరిసారిగా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ చిత్రంలో నటించారు. మచిలీపట్నానికి చెందిన వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. సినిమాల్లోకి వచ్చాక ఫిష్ వెంకట్‌గా మారారు. గతంలో ఆయనొక చిన్న చేపల వ్యాపారి. 1989లో ఓ మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్‌ పరిచయవడంతో ఆయన 1991లో నిర్మించిన జంతర్‌ మంతర్‌ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆయనకు ఎలాంటి గుర్తింపూ తెచ్చి పెట్టలేదు కానీ అవకాశాలను మాత్రం అందించింది. 2002లో ఎన్టీఆర్‌ హీరోగా వీవీ వినాయక్‌ తీసిన ‘ఆది’ సినిమా ఫిష్ వెంకట్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ‘ఒక్కసారి తొడకొట్టు చిన్నా’ అనే డైలాగ్‌‌తో ఫిష్ వెంకట్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *