ఇండస్ట్రీలో ఆసక్తికరంగా ఒక అంశం జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ‘మహాభారతం’ ప్రాజెక్టు.. దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిసిందే. ఆయన దానిని రూపొందించాలని కలలు కన్నారు. ఇంతలోనే అనూహ్యంగా ఆ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నానంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాదు.. ఆయన హడావుడిగా ఈ ప్రాజెక్టు కోసం ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. పలు భాగాలుగా రూపొందించనున్నట్టు సైతం వెల్లడించారు. శ్రీకృష్ణుడిగా తనను తాను ప్రకటించేసుకున్నారు. ఇక తాజాగా మరో వార్త వచ్చింది. అదేంటంటే.. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను రాజమౌళి రూపొందించనున్నారని వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో దాదా సాహెబ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ఫర్మ్ అయ్యారని సైతం వార్తలొచ్చాయి.
రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని.. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారంటూ వార్తలొచ్చాయి. ఇన్ని వార్తలొచ్చాక తాజాగా మరో వార్త.. ఈ ప్రాజెక్టు కోసం తనను రాజమౌళి కాదు.. అమీర్ ఖాన్ సంప్రదించారంటూ దాదా సాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి సమర్పణలో రానున్నట్టు తాను విన్నానని.. కానీ ఆయన టీమ్ తనను సంప్రదించలేదని.. అమీర్-రాజ్‌కుమార్ హిరాణి టీమ్ మాత్రం తమతో ఎన్నోసార్లు చర్చలు జరిపిందన్నారు. ఈ ప్రాజెక్టులో దాదాసాహెబ్‌గా అమీర్ నటించనుండటం తమకు ఆనందాన్నిచ్చిందని చంద్రశేఖర్ శ్రీకృష్ణ వెల్లడించారు. ఇదంతా చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. రాజమౌళి, అమీర్ ఖాన్ ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్టులు ఒకటే కావడం.. ఇద్దరిలో ఒకడుగు అమీర్ ఖాన్ ముందుడటం యాదృశ్చికమో.. లేదంటే రాజమౌళి మనసును ముందుగానే అమీర్ రీడ్ చేస్తున్నారా? అనిపిస్తోంది.
ప్రజావాణి చీదిరాల