పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏఎం రత్నం మీడియాతో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఖుషి, బంగారం తర్వాత పవన్ కల్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు.
సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది. పవన్ కల్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒత్తిడి మాపై కచ్చితంగా ఉంది. ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు.
పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము. మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కల్యాణ్ గారు కూడా ప్రశంసించారు.