Alexa Helped UP Girl :
ఆమె పెద్దయ్యాక తాము ఉద్యోగమిస్తామన్న ఆనంద్ మహీంద్రా
ఉత్తరప్రదేశ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నికిత అనే బాలిక తమ ఇంట్లోకి చొరబడిన కోతులను అలెక్సా సాయంతో ఎంతో చాకచక్యంగా తరిమికొట్టింది.
ఈ అంశం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించి.. ఆ బాలికకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే… 13 ఏళ్ల నికిత, తన మేనకోడలు వామిక (15 నెలలు)ను ఇంట్లో ఆడిస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా కోతుల గుంపు వాళ్లింట్లోకి చొరబడింది.
ఆ కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేస్తూ, విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో పెద్దవాళ్లెవరూ ఇంట్లో లేరు. ఆ వానరాలు తమ వద్దకు వస్తుండడాన్ని గమనించిన నికిత ఏమాత్రం భయపడకుండా ఎంతో తెలివిగా ఆలోచించింది.
ఇంట్లో అలెక్సా (వాయిస్ అసిస్టెంట్) ఉన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ‘అలెక్సా.. కుక్కలా మొరుగు’ అంటూ అలెక్సా కు కమాండ్ ఇచ్చింది.
వెంటనే అలెక్సా స్పీకర్ నుంచి కుక్క అరిచినట్టుగా పెద్ద శబ్దాలు రావడంతో, నిజంగానే కుక్క అరుస్తోందని భావించి కోతులు భయపడి పారిపోయాయి.
ఇలా నికిత సమయస్ఫూర్తి ప్రదర్శించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది.
ఆయన వెంటనే స్పందిస్తూ నికిత పెద్దయ్యాక తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత ఏదైనా కార్పొరేట్ సంస్థలో చేరాలనుకుంటే, తమ మహీంద్రా రైజ్ సంస్థ ఆమె కోసం ద్వారాలు తెరిచి ఉంచుతుందని ఆనంద్ మహీంద్రా వివరించారు.
ఎప్పుడైనా ఉద్యోగం కావాలనుకుంటే మహీంద్రా రైజ్ లో చేరాలని ఆహ్వానిస్తున్నాం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
‘‘ఇప్పటితరం పిల్లల మేధాశక్తి మన ఊహకు అందని విషయం, వారి తెలివితేటలు అమోఘం, ఆ సమయంలో నికితకు వచ్చిన ఆలోచన అద్భుతం’’ అని ఆయన కొనియాడారు.
Also Read This Article : పుట్టడమే స్టార్ గా పుట్టినా, సరైన హిట్టు లేని హీరో
