సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మచ్చను అదేనండి.. గాసిప్‌ను మోయాల్సిందే. కానీ బి సరోజాదేవి అలా కాదు. ఆమె సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల్లో ఇది కూడా ఒకటి. 87 ఏళ్ల సరోజా దేవి నేడు (సోమవారం) మరణించారు. 13 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 29 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలారు. 161 సినిమాలు చేశారు. అన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండటమంటే ఎన్ని రూమర్స్ ఆమెపై వచ్చి ఉంటాయో అనిపిస్తుంది కదా.. కానీ ఒక్కటంటే ఒక్క గాసిప్ కూడా ఆమె గురించి లేదు. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో తెలిపారు.
అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చానని… ఓ కార్యక్రమంలో కన్నడ నిర్మాత కన్నప్ప భాగవతార్ తనను చూసి కన్నడ సినిమాలో అవకాశమిచ్చారని తెలిపారు. కొందరు ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమాత్రం నటనపై ఆసక్తి లేని సరోజాదేవిని మాత్రం అవకాశం వెదుక్కుంటూ వచ్చిందట. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చారట. వివాహనంతరం భర్త శ్రీ హర్ష కూడా ఎంతగానో ఆమెను ప్రోత్సహించారట. ఎందరో స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ బి సరోజాదేవిపై ఒక్క గాసిప్ కూడా రాలేదంటే ఆమె ఎంత పద్ధతిగా జీవితాన్ని గడిపారో అర్థం చేసుకోవచ్చు. అది తన అదృష్టమని సరోజాదేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తొలుత తాను సన్యాసినిగా జీవితాన్ని గడపాలని అనుకున్నారట. కానీ వరుస సినిమా అవకాశాలు తన జాతకాన్నే మార్చేశాయని తెలిపారు.