ప్రస్తుత తరుణంలో సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో.. అలా నెలలోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అలాంటిది ఒక సినిమా విడుదలైన 15 ఏళ్ల వరకూ ఓటీటీలోకి రాలేదంటే సాధారణ విషయం కాదు. తాజాగా అలాంటి అసాధారణ విషయం ఒకటి జరిగింది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘శుభప్రదం’. అల్లరి నరేష్, మంజరి ఫడ్నీస్ జంటగా రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ వీక్‌గా ఉండటంతో ఈ సినిమా సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఇవి మాత్రమే కాకుండా ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు చాలానే ఉన్నాయి.
అయితే ఈ సినిమా సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కె. విశ్వనాథ్ చివరి సినిమా కావడం కూడా ఇందుకు కారణంగానే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం జియోహాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కె. విశ్వనాథ్ 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా.. అందులో 5 చిత్రాలు జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డులను అందుకున్నాయి. కె.విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యల కారణంగా 2023 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.