ఇటీవల కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు బంద్ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ల బంద్‌కు సంబంధించి వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఫిలిం ఛాంబర్ స్పష్టత ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ నిర్వహించాము. ఈ మీటింగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.
ప్రస్తుతం థియేటర్లలో నెలకొన్న కొన్ని సమస్యల గురించి చర్చించాం. జూన్ 1వ తారీకు నుంచి థియేటర్లు మూతపడతాయంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే తప్ప వాటిలో ఎలాంటి నిజమూ లేదు. ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్ ఉంది. ఆరోజు మూడు సెక్టార్లకు నుంచి ఒక కమిటీ నిర్మించబోతున్నాము. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా ఆ కమిటీ పని చేయబోతుంది. దీనికి సంబంధించిన ఎటువంటి వార్తలైనా ఫిలిం ఛాంబర్ లేదంటే అనుబంధ సంస్థల నుంచి బయటకు వస్తేనే ప్రచారం చేయండి. బయటి నుంచి వచ్చే వార్తలను నమ్మి ప్రచారం చేయకండి. ఎందుకంటే అటువంటి అబద్ధపు వార్తలు కేవలం చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి.
అలాగే ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము. గతంలో కూడా కొన్ని సమస్యలకు ప్రభుత్వంతో కూర్చుని చర్చించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చించబోతున్నాము. ఏదో ఒక సినిమాను టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము. ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యల నుంచి బయట పడి ముందుకు వెళ్తాము” అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, కేల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారంగ్, అనుపం రెడ్డి, భరత్ చౌదరి, టి ఎస్ రాంప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి చీదిరాల