దర్శకుడు సుకుమార్.. సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. దీనికి కారణం ఆయన ఎంచుకునే స్క్రిప్ట్. సినిమాను సక్సెస్ దిశగా నడిపించే తీరు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ దర్శకుడికి లేని ఒక స్పెషాలిటీ ఈయనలో ఉంది. తను సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తన శిష్యులను సైతం మంచి దర్శకులుగా నిలబెడుతున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు , ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల అంతా సుక్కు శిష్యులే కావడం విశేషం. వీరిలో శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సాన అయితే ఫుల్లు ఫాంలో ఉన్నారు. అయతే వీరు మాత్రమే కాకుండా సుక్కు మరో ఇద్దరిని కూడా లైన్‌లో పెట్టినట్టు సమాచారం.
స్ట్రాటజీ ప్రకారమే ‘పుష్ప2’కి సంబంధించిన ఓ ఈవెంట్‌లో కొందరిని స్టేజ్ మీదకు పిలిచి మరీ వారిని పరిచయం చేసి భవిష్యత్‌లో పెద్ద దర్శకులు కాబోతున్నారని సుక్కు వెల్లడించారు. ముఖ్యంగా స్టోరీ, స్క్రీన్‌ప్లే విభాగాల్లో తనకంటే బెటర్‌గా వాళ్లు పని చేస్తారని చెప్పి వారిలో కావల్సినంత కాన్ఫిడెన్స్ నూరిపోశారు. మొత్తానికి ఈ ఈవెంట్‌లో కొందరికి కావల్సినంత హైప్ ఇచ్చిన సుక్కు.. వచ్చే ఏడాది రైటింగ్స్ విభాగంలోని ఇద్దరిని దర్శకులుగా పరిచయం చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబును లాంచ్ చేసిన విధానంలోనే వీరిద్దరినీ కూడా లాంచ్ చేస్తారని నెట్టింట జోరుగానే చర్చించుకుంటున్నారు. మొత్తానికి సుకుమార్ బరిలోకి దింపబోయే మెరికలెవరు? అసలు ఈ వార్తలు నిజమేనా? అనే విషయాలు తెలియనున్నాయి.
Also Read This : క్లైమాక్స్ ప్లేస్, యాక్టర్స్ ఫిక్స్?
