పహల్గాం ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన సినీ ప్రముఖులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృ తి అందాలకు నిలయమైన కశ్మీర్‌ను చూసి రిలాక్స్ అవుదామని వెళ్లిన 28 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీనిపై యావత్ దేశం భగ్గుమంటోంది. సినీ ప్రముఖులు సైతం ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ పెను విషాదంలో బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, సోనూసూద్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులంతా ట్విటర్ వేదికగా మృతులకు సంతాపం తెలియజేశారు. భావోద్వేగ పోస్టులు పెట్టారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అయితే వీడియో ద్వారా కన్నీటి పర్యంతమయ్యారు.

చిరంజీవి: 28 మంది అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనది. క్షమించరానిది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది. బాధిత కుటుంబాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

ఎన్టీఆర్: పహల్గామ్ దాడి బాధితుల గురించి తెలుసుకున్న తర్వాత నా హృదయం బరువెక్కింది. మృతుల కుటుంబాలకు దేవుడు బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా

సంజయ్‌దత్‌: ఇది క్షమించరాని చర్య. ఈ ఉగ్రదాడిపై అంతా మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకుని తగిన విధంగా బుద్ధి చెప్పాలి

అక్షయ్‌ కుమార్‌: ఈ దాడి భయంకరమైనది. అమాయకులను చంపడం దారుణం. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా

అల్లు అర్జున్: పహల్గాం ఎంతో అందమైన ప్రదేశం. అక్కడ జరిగిన ఈ దాడి గురించి తెలిసి నా గుండె పగిలిపోయింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. మృతి చెందిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

సోనూసూద్‌: అమాయక పర్యటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి తావుండకూడదు. ఈ దుర్మార్గపు చర్య ఏమాత్రం అంగీకరించదగినది కాదు.

జాన్వీ కపూర్‌: పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురి చేసింది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అన్యాయం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. మా మద్దతు మీ కుటుంబానికి బాధిత కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. ఈ బాధ నుంచి కోలుకునే ధైర్యాన్నివ్వాలని దేవుడిని వేడుకుంటున్నా.

మంచు విష్ణు: పహల్గామ్ ఘటన పిరికిపంద చర్య. హృదయ విదారక దాడి. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి సమయాల్లో, మనం కలిసి బలంగా నిలబడాలి. ఈ దుఃఖ సమయంలో మనం ఐక్యంగా, దృఢంగా ఉందాం. ఉగ్రవాదం మనల్ని ఎప్పుడూ విభజించలేదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *