Illayaraja: ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా?

రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, కీరవాణి పాల్గొన్నారు.మూవీ టీజర్‌ను ఇళయరాజా విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ.. ‘‘ఈ ఏజ్‌లో కూడా ఇలా సంగీతం చేస్తున్నారే అని రాజేంద్రప్రసాద్ అంటున్నాడు.. ఎలా చేస్తున్నారో అంటే పర్లేదు కానీ ఇలా చేస్తున్నారేంటని అంటున్నాడు. ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా రాజేంద్రపసాద్..? కీరవాణి రాసిన పాట పల్లవి వినిపించినప్పుడు, కీరవాణి తన మనసులో నాపై ఉన్న ఆత్మ బంధాన్ని రాశారని నాకు అర్థమైంది. నా మీద ఉన్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు. సంగీత దర్శకుడు అవడానికి ముందు, సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన తర్వాత కూడా ఆయనకు నా మీద అభిమానం అలాగే ఉంది’’ అన్నారు.

కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్‌కి నేను ఒక పాట రాశాను. సాధారణంగా డైరెక్టర్ సిట్యుయేషన్ చెప్పినప్పుడు ఆ కథకి, ఆ పాత్రలకి తగినట్టుగా పాట రాయడం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో నేను రాసిన పాట ఈ సినిమాలోని సందర్భంతోపాటు, నా జీవితానికి కూడా సంబంధించింది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘యుగంధర్’ సినిమాలోని ఒకపాటలో ఒక వయొలిన్ బీట్ విని నేను ఇళయరాజా గారి సంగీతానికి అభిమానిగా మారాను. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను మద్రాసు వెళ్ళినప్పుడు, ఇళయరాజా గారి ఇల్లుని ఆరాధనా భావంతో చూసేవాడిని. చాలా సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారి దగ్గర పరిచేసేటప్పుడు వేటూరి గారు ఇళయరాజా గారిని కలిసే భాగ్యం కలిసింది. ఇళయరాజా గారి సంగీతానికి పాడాలని అనుకున్నా కానీ, ఆ అవకాశం రాలేదు. కానీ ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఆయన పక్కన కూర్చునే అవకాశం కూడా వచ్చింది’’ అన్నారు.

దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప వారు నా సినిమాకి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నేను అదృష్టవంతుడిని’’ అన్నారు. హీరోయిన్ ఆకాంక్షాసింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్పవారితో వేదిక పంచుకోవడం, వారు సినిమాకి పని చేయడం నా అదృష్టం. నవరసభరితమైన ఈ సినిమా మాకు గర్వకారణంగా నిలుస్తుంది’’ అన్నారు. హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద దిగ్గజాలతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *