Star Doctors :
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాం అనేది గతం. గతం గతః. ప్రస్తుతం టైమ్ మారింది.
అసలు ఇప్పుడెందుకు ఈ మాట వచ్చిందంటే భారతదేశంలో హీరోయిన్లుగా చలామణిలో ఉన్న అనేకమంది తారలు
డాక్టర్ చదివిన తర్వాత తెరపై అవకాశం రావటంతో ఎగిరి గంతేసి మరి హీరోయిన్లుగా వచ్చారు. వస్తున్నారు కూడా..
సాయిపల్లవి :
నటి సాయిపల్లవి డాక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయిన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు.
ఆమెది వెరీ సక్సెస్‌ఫుల్ స్టోరీ అని చెప్పాలి. 2005, 2008లో బాలనటిగా రెండు తమిళ సినిమాల్లో నటించారామె.
చిన్నప్పటినుండే డ్యాన్స్ అంటే ఆమెకి పిచ్చి. 2015లో మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రంతో ప్రపంచమంతా మారుమోగిన పేరు సాయిపల్లవి.
‘ప్రేమమ్’ సినిమాలోని పాటలకు ఆమె కొరియోగ్రాఫ్ చేసుకోవటం విశేషం.
ఆ చిత్రంలోని ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో 2017 భానుమతిగా ‘ఫిదా’ చిత్రంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు.
అప్పటినుండి ఈమె తెలుగులో చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే.
నానితో రెండు సినిమాలు ‘యం.సి.ఏ’, ‘శ్యామ్ సింగరాయ్’, నాగచైతన్యతో రెండు సినిమాలు ‘లవ్‌స్టోరీ’, ‘తండేల్’
వరుణ్‌తేజ్‌తో ‘ఫిదా’, శర్వానంద్‌తో ‘పడిపడిలేచె మనసు’, రానాతో ‘విరాటపర్వం’ మాత్రమే ఆమె తెలుగులో నటించిన చిత్రాలు.
కాకపోతే ప్రస్తుతం ఏ భాషలో సినిమాలు చేసినా డబ్బింగ్ రూపంలో అన్ని సినిమాలు ప్రతిచోటా విడుదల అవ్వటంతో ఆమె చాలా సినిమాల్లో నటించిన ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారామె.

శ్రీలీల :
నటి శ్రీలీల తన యంబిబియస్ చదువు ఫైనల్ ఇయర్‌లో ఉండగానే అవకాశం రావటంతో ఎగిరి గంతేసి
హీరోయిన్‌గా రాఘవేంద్రరావుగారి పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లిసందడి’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా ఎదిగిన ముద్దుగుమ్మ శ్రీలీల.
ఈ సినిమా ఫట్ అయినా కూడా అవకాశాలు అమ్మడిని వెదుక్కుంటూ వచ్చాయి.
‘పెళ్లిసందడి’కి ముందు ‘చిత్రాంగధ’ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో తెలుగులో నటించారామె.
ఆ సినిమా తర్వాత కన్నడలో ‘కిస్’ సినిమాలో నటించగా ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవటంతో కన్నడలోను అమ్మడు పేరు మారు మోగిపోయింది.
అక్కడనుండి ఆమె వెనుతిరిగి చూసిందే లేదు.
ఈ మూడేళ్లలో 12 సినిమాలు చేశారు కానీ, వాటిలో ఎక్కువశాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.
సినిమాల పరంగా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన కానీ ఈ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’, రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలు ఆమెకు ఎంతో కొంత పేరుతెచ్చాయి.

మీనాక్షి చౌదరి :
మీనాక్షి చౌదరి డెంటల్ సర్జన్. ఆ తరువాత 2018లో మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
ఆ తరువాత 2021లో ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
అక్కడి నుంచి అమ్మడిని వరుస సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వస్తూనే ఉన్నాయి.
‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు అమ్మడికి ఏకంగా స్టార్ స్టేటస్‌ను అందించాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘విశ్వంభర’ చిత్రంలోనూ నటిస్తోంది.

శివాని రాజశేఖర్ :
శివాని రాజశేఖర్ కూడా తండ్రి మాదిరిగా డాక్టరే. అపోలో మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసింది.
సినిమాలపై ఆసక్తితో 2021లో అద్భుతం అనే చిత్రంలో నటించింది.
ఆ తరువాత పలు సినిమాలల్లో నటించింది కానీ ఆశించిన గుర్తింపు అయితే ఇంకా ఈ ముద్దుగుమ్మకు రాలేదనే చెప్పాలి.

రూపా కొడవయూర్ :
ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అవకాశం రావడంతో ఆనందంగా యాక్టర్‌గా మారిపోయింది.
2020లో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయినా కూడా మంచి సక్సెస్ సాధించింది.
ఆ తరువాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో నటించింది. ‘యమకథగి’ అనే చిత్రంతో తమిళంలోనూ పరిచయం కానుంది.
ప్రన్తుతం ‘సారంగపాణి జాతకం’తో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదితి శంకర్ కూడా మెడిసిన్ పూర్తి చేసింది. తండ్రి శంకర్ ఫేమస్ డైరెక్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ సైతం సినిమాల్లోకి అడుగు పెట్టింది.
ఆ తరువాత హీరోయిన్‌గానూ.. సింగర్‌గానూ రాణిస్తోంది.
2017లో మిస్ వరల్డ్‌గా నిలిచిన మానుషి చిల్లర్ సైతం ఎంబీబీఎస్ చేసి సినిమాల్లోకి అడుగు పెట్టింది.
‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో నటించింది. పొలిమేర ఫేమ్ మీనాక్షి భాస్కర్ల సైతం మెడిసిన్ చేసింది.

ప్రజావాణి చీదిరాల
Also Read This : డియర్ నిర్మాతల్లారా….వెల్‌కమ్ టు ద ఇండస్ట్రీ
