తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ముగిసి నెలన్నర అయింది.. కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా 40 రోజులు దాటింది. అటు చూస్తే మరొక్క మూడు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి.
కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా.. దానిని ఎలాగైనా అడ్డుకోవాలని ఇండియా పేరిట ప్రతిపక్ష పార్టీలను ఒక్కటి చేస్తోంది కాంగ్రెస్.
వీటి మధ్యనే మూడో ప్రత్యామ్నాయం అనే మాటనే మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఈ మేరకు మూడో కూటమికి అవకాశాలు లేవా? అంటే కచ్చితంగా లేవని చెప్పలేం.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ మేరకు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలొ బీఆర్ఎస్ విస్తరణకు అక్కడి నేతలను పార్టీలో చేర్చుకున్నారు.
అయితే, తెలంగాణలో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ అడుగులకు అడ్డుకట్ట పడింది.
మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులకే కేసీఆర్ ఫామ్ హౌస్ లో గాయపడ్డారు. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
బయటకు వచ్చేది అప్పుడేనా?
సర్జరీ తర్వాత 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. వైద్యులు చెప్పిన గడువులో ఇప్పటికే దాదాపు రెండు వారాలు ముగిశాయి. మరో ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం నందినగర్ లో ఉంటున్న ఆయన త్వరలో ఫామ్ హౌస్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ బొప్పాయి తోటను సాగు చేసే ఉద్దేశంలో గజ్వేల్ పురుగుమందుల వ్యాపారికి కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే, కేసీఆర్ రాజకీయ క్షేత్రంలోకి వచ్చేది ఎప్పడనేది సందిగ్ధత నెలకొంది. తమ అధినేత ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తారని పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ పలుసార్లు ప్రకటించారు.
71వ పుట్టిన రోజు నుంచి పున: ప్రయాణం
ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ శ్రేణులను కలుసుకోవడంతో పాటు అటు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ బాధ్యత. దీనిని నెరవేర్చేందుకు ఇప్పటికే కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ఆయన ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17ను పుట్టారు. ఈ ఫిబ్రవరి 17తో 70 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. వాస్తవానికి గత ఫిబ్రవరి 17నే ఆయన తనకు వయసు పెరుగుతోందనే సంకేతాలిచ్చారు. అప్పటికి బీఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడడం ఆపై అంతే అనూహ్యంగా గాయపడడంతో ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కంచాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సరైన తేదీగా తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.