Mallikarjuna Kharge :
అంతా బాగుండి ఉంటే.. ఇప్పుడు ఆయన కర్ణాటక సీఎం అయి ఉండేవారేమో..? కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..? అనుకోని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది.
చివరకు ఆయన ఇప్పుడు ప్రధాని అభ్యర్థి అవుతున్నారు. ఏమో..? టైమ్ బాగుంటే నాలుగు నెలల్లో ప్రధాని కూడా అవుతారేమో?
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి నాయకుడిగా ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ మేరకు శనివారం ఇండియా కూటమి ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), నీతీశ్ కుమార్ (జేడీయూ), అర్వింద్ కేజ్రీవాల్ (ఆప్) తదితరులు వర్చువల్ గా సమావేశమయ్యారు.
ఇందులో ఖర్గేను కూటమి నేతగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఒకవేళ ‘ఇండియా’ చైర్మన్ గా ఖర్గే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే.. తమ ప్రధాని అభ్యర్థిగా కూడా ప్రకటించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఖర్గే నాయకత్వాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు నేతలు ప్రతిపాదించిన విషయం గమనార్హం.
కర్ణాటక దళిత నేత
81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన దళిత నేత. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు.
అంతకుముందు కర్ణాటకలో మంత్రిగానూ పనిచేశారు. మరోవైపు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగానూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోగా రాజ్యసభ సీటు ఇచ్చారు.
పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన ఆయనను 2022లో జాతీయ అధ్యక్ష పదవి వరించింది. రాహుల్ సహా గాంధీ కుటుంబ సభ్యులెవరూ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందుకురాకపోవడంతో ఖర్గే ఎన్నిక లాంఛనమైంది.
ఇప్పుడు ఇండియా కూటమి చైర్మన్ గానూ ఆయనకు కీలక బాధ్యతలు దక్కనున్నాయి. నాలుగు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికలకు ఇండియా కూటమి నేత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మోదీని ఢీకొట్టేలా..
ఖర్గే ప్రధాని అభ్యర్థి బహుజన ఓటు బ్యాంకును సంఘటితం చేసి మోదీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ కు మంచి అవకాశం దక్కనుంది. దేశానికి దళితుడు ప్రధాని అవబోతున్నారనే ప్రచారం ఎన్నికల్లో హస్తం పార్టీకి మేలు చేయనుంది. కాగా, కర్ణాటకలో గత వేసవిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది. ఆ రాష్ట్రానికే చెందిన ఖర్గే.. కాంగ్రెస్ చీఫ్ కాకుండా ఉంటే ఆయనకే సీఎం పదవి దక్కే వీలుండేది. అర్హత ఎక్కువ కావడంతో చాన్స్ చేజారింది. అయితేనేం.. ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యే అవకాశం దక్కనుంది. ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఖర్గేను ప్రధానిగా చూడొచ్చు కూడా…?