Yamaleela :
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. అదే ఐడియా ఒక దర్శకునికి వస్తే ఎంతోమంది జీవితాలను మారుస్తుంది. ఒక ఐడియా సినిమాగా రూపొందితే కథ తయారవుతుంది. ఆర్టిస్ట్‌లు పుట్టుకొస్తారు. టెక్నీషియన్లు తయారవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొన్ని గోల్డెన్ ఇయర్స్ ఉంటాయి. అలా బాగున్న టైమ్‌ని ఎరా అంటుంటాం.
ఒక దర్శకునికి ఒక చిన్న ఐడియా వచ్చింది. యముడు, చిత్రగుప్తుడు లెక్కలు చూసుకుంటుంటే భవిష్యవాణి జారిపడి భూమ్మీద పడింది. కట్ చేస్తే అతని లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. దానిచుట్టూ అల్లిన కథే ఆకతాయి కుర్రోడు సూరజ్, అమ్మ సెంటిమెంట్, పిక్‌పాకెట్ చేసే హీరోయిన్ లిల్లీ, తోటరాముడు, ఇన్స్‌పెక్టర్ రంజిత్‌కుమార్‌లతో పాటు జుంబారే..జుజుంబరే అంటే స్పెషల్ డాన్స్‌నంబర్‌లో యాక్ట్ చేసిన సూపర్‌స్టార్ కృష్ణ, సౌందర్యలు అధనం. చిన్న బడ్టెట్‌తో తెరకెక్కిన సినిమా.
అలాంటి ఐడియా ప్రముఖ దర్శకుడు యస్.వి కృష్ణారెడ్డిగారికి 1993లో వచ్చింది. వచ్చిందే తడవుగా మద్రాస్ టు హైదరాబాద్ ఫ్లైట్‌లో వెళ్లి సూపర్‌స్టార్ కృష్ణకి పూసగుచ్చినట్లు కథంతా చెప్పారు. ‘రాజేంద్రుడు–గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెంబర్‌వన్’ సినిమాల సృష్టికర్తగా.. హ్యాట్రిక్ దర్శకుడిగా ఫుల్‌ఫాంలో ఉండి ఎక్కడ చూసినా ఎస్‌వీ హవా నడుస్తున్న రోజులవి. కథ విన్న సూపర్‌స్టార్ కృష్ణ చాలా బావుందని.. కానీ తన కుమారుడు మహేశ్ ఇంకా చదువుకుంటున్నాడని.. ఈ తరుణంలో సినిమా చేయడం కష్టమని చెప్పారట.
లేదంటే ‘యమలీల’తో రాజకుమారుడు మహేశ్‌బాబు ఎంట్రీ ఇచ్చి ఉండేవాడు. మహేశ్ చేయలేదు కాబట్టి ఎస్వీ కృష్ణారెడ్డి కథను పక్కకు పెట్టలేదు. ఎలాగైనా ఈ కథ ఆడుతుందనే నమ్మకంతో అప్పుడప్పుడే నటుడిగా రాణిస్తోన్న అలీని అడిగి చూద్దాం అనుకుని దర్శకనిర్మాతలు అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు.. అతనికి కబురుచేశారు . తెల్లారేసరికి గురువుల దగ్గరికి సాహో అంటూ వచ్చి వాలాడు అలీ. ఆ రోజు అలీకి కూడా తెలియదు తాను చేస్తున్న సినిమా మహేశ్ చదువుకుంటున్నాడు కాబట్టి తనకు వచ్చిందని. సీన్ కట్ అలీ హీరోగా పెద్ద పారితోషికం అందుకున్నారు.
హీరోగా మొదటి పేమెంట్ 50,000. ఒక్కసారిగా అలీకి కళ్ల నుంచి నీళ్లొచ్చాయి. గురువులిద్దరి కాళ్లకు దణ్ణం పెట్టి ‘మీరు ఏం చెప్పినా చేస్తాను గురూజీ’ అంటూ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లి వాళ్లమ్మకి నోట్ల కట్ట చూపించాడు. వాళ్లమ్మ శహభాష్ బేటా అంటూ ఆశీర్వదించింది. ఆ సినిమా పేరు ‘యమలీల’. షూటింగ్ అయిపోయింది. 28 ఏప్రిల్ 1994లో సినిమా విడుదలయ్యింది. రూ.75 లక్షలతో చేసిన సినిమా కోట్లు కుమ్మరించింది. ఆ రోజు వచ్చింది డబ్బు మాత్రమే కాదు… కొన్ని జీవితాల్లో వెలుగు.
ఆ రోజు కృష్ణారెడ్డిగారికి వచ్చిన ఐడియాతో ఈ రోజుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలుచున్న వారి సంఖ్య ఎంతో ఇప్పటికీ వెల కట్టలేం. సినిమా పరిశ్రమలో ఒక్క ఐడియా హిట్టయితే ఎంతమంది నిలదొక్కుకుంటారో అనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఒక్కో ఐడియావల్ల ఎన్నో జీవితాలు మారుతూ, తారుమారు అవుతూ నిత్యం ప్రేక్షకుల నోళ్లలో నానుతూ ఉంటారు సినిమావారు. 31 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా గురించి మాట్లాడుతున్నామంటే అప్పటి ఆ సినిమా సూపర్‌హిట్, ఆ సినిమా చేసిన వారందరి లైఫ్‌లు బ్లాక్‌బస్టర్ హిట్‌లు. ‘యమలీల’ సినిమా విడుదలై 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా దర్శక,నిర్మాతలను , నటులను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ‘ట్యాగ్‌తెలుగు.కామ్’ అందిస్తున్న ఆర్టికల్ ఇది.
శివ మల్లాల
Also Read This : స్టైలిష్ ‘రౌడీ’ వేర్‌తో సూర్య.. ఇంతకీ దేనిని ప్రమోట్ చేస్తున్నట్టు?