Ys Sharmila :
ఏపీ సీఎంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసులు పెట్టించారా? తనపై నమోదైన అక్రమాస్తుల కేసులో తన తండ్రి పేరును తానే చేర్పించారా.
ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ కేసులు పెట్టిందన్నది నిజం కాదా? స్వయంగా రాజశేఖర్ రెడ్డి కూతురు, జగన్ కు సోదరి అయిన వైఎస్ షర్మిలే ఈ విషయాన్ని బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సొంత అన్న వైఎస్ జగన్ తో రాజకీయంగా విభేధిస్తూ సంచలన ఆరోపణలు గుప్పిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా ఈ బాంబు పేల్చారు.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ తనతో పాటు తన తండ్రి వైఎస్సార్ పేరును ఆస్తుల కేసులో చేర్చి వేధిస్తోందని జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో జగన్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఆమెపై పడింది. దీంతో షర్మిల ఒకింత ఘాటుగానే జగన్ కు కౌంటర్ ఇచ్చారు.
ఆస్తుల కేసులో వైఎస్ పేరును చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్వయంగా జగనేనని ఆమె సంచలన ఆరోపణ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తుల కేసులో తనను అరెస్టు చేసి జైలుకు పంపిందని, అలాంటి పార్టీలో షర్మిల చేరిందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలకు షర్మిల గుంటూరు జిల్లా ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు.
వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని ఆమె వెల్లడించారు.
జగన్ తరఫున అప్పట్లో కేసులు వాదించిన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్ లో చేర్చించారని షర్మిల అన్నారు.
అక్రమాస్తుల కేసు నుంచి తాను బయటపడాలంటే రాజశేఖర్ రెడ్డి పేరును చేర్చాలని, మరణించిన వ్యక్తిపై కేసు కాబట్టి సులువుగా బయటపడవచ్చనే ఉద్దేశంతోనే వైఎస్సార్ పై పిటిషన్ వేయించారని ఆరోపించారు.
ఈ కేసు వేసినందుకు బహుమానంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చాక అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇది నిజం కాదని దమ్ముంటే జగన్ చెప్పాలన్నారు. అంతే తప్ప.. వైఎస్సార్ పై ఛార్జిషీట్ లో కాంగ్రెస్ పాత్ర లేదని స్పష్టం చేశారు. అయితే.. గతంలో కాంగ్రెస్ పార్టీ పొరబాటున వైఎస్సార్ పేరును చేర్చిందని షర్మిల చెప్పడం గమనార్హం.
Also Read This Article : ఏపీలో మళ్లీ జగనే సీఎం – కేసీఆర్