ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల టైం నడుస్తోంది. వివిధ భాషల వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐఎండీబీలో 8.6 రేటింగ్‌తో ఓ వెబ్ సిరీస్ దూసుకెళుతోంది. జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఖుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సిరీస్‌ను రమేష్ ఇందిర రూపొందించారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కన్నడ, హిందీ, తమిళ భాషలలో భారీ విజయం సాధించి.. ఇప్పుడు తెలుగులోనూ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది.
ఈ వెబ్ సిరీస్ కథ చిక్ మంగళూర్ నేపథ్యంలో సాగుతుంది. చిక్ మంగుళూరులో ఓ కుటుంబంలో ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. ప్రతి మరణం కల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని నమ్ముతుంటారు. మంచి సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో రూపొందిన ఈ కథ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. దీనిపై ఖుషీ రవి మాట్లాడుతూ .. ‘అయ్యనా మానే’లో భాగం కావడం ఆనందంగా ఉందని.. తన పాత్ర సవాలుతో కూడుకుని ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగులోకి రానుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు.
ప్రజావాణి చీదిరాల