Aravind Kejriwal :
అంతర్జాతీయంగా కేజ్రీవాల్ కు పెరుగుతున్న మద్దతు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసి నరేంద్ర మోదీ సర్కారు తప్పు చేసిందా? కేజ్రీవాల్ కోర్టులో వాదించినట్లుగా నలుగురి వాంగ్మూలాలతో సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం బీజేపీ సర్కారు తప్పిదాన్ని ఎత్తి చూపుతోందా? అంటే.. అంతర్జాతీయంగా కేజ్రీవాల్ కు పెరుగుతున్న మద్దతును చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పన ద్వారా రూ.100 కోట్ల ముడుపులు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయంటూ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తులో భాగంగా పార్లమెంటు ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయడమే మోదీ ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది. ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఆయనను అరెస్టు చేశారంటూ ఆప్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తుండగా.. బ్రిటన్, అమెరికా దేశాల ప్రభుత్వాలు కేజ్రీవాల్ అరెస్టును తప్పుబట్టాయి.
ఢిల్లీ సీఎం అరెస్టును తప్పుబట్టిన ఐక్యరాజ్య సమితి
కేజ్రివాల్ అరెస్టుతో పాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభనను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. భారత్ లో న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూల చట్ట ప్రక్రియలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది. అయితే తమ దేశ అంతర్గత వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడమేంటంటూ బీజేపీ నేతలు బ్రిటన్ ను తప్పుబట్టారు.కానీ, అమెరికా ప్రకటనపై మాత్రం కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ, తాజాగా ఐక్యరాజ్య సమితి సైతం కేజ్రీవాల్ అరెస్టును తప్పుబడుతూ ప్రకటన చేసింది. భారత్ లో ప్రతీ ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్.. తెలిపారు. ఎన్నికలు ఉన్న ఏ దేశంలోనైనా, రాజకీయ నేతలు, పౌరులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. హక్కులు ఉంటేనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయమైన వాతావరణంలో ఓటు వేయగలరన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన నేపథ్యంలో భారతదేశంలో నెలకొన్న రాజకీయ అశాంతిపై ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ స్ధాయిలో దేశం పరువు కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read This Article : సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ

Also Read This Article : వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి?