ముంబైలో ‘వేవ్స్ (World Audio Visual Entertainment Summit)’ సమ్మిట్ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌లో అన్ని సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటీనటులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతే తన ఫిట్‌నెస్‌కు కారణమని.. గతంలో తాను సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డానని తెలిపాడు. బాల్యం నుంచే తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు. సినిమాయే తన ప్రపంచమని.. అది తప్ప వేరొక ఆలోచనే లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు. ఎంతో మంది తనపై చూపించిన అభిమానం కారణంగానే తనీ స్థాయిలో ఉన్నానని.. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపాడు.
ఈ వేవ్స్ సమ్మిట్‌లో అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి గురించి సైతం మాట్లాడాడు. తన మామయ్య చిరంజీవి తనకు స్ఫూర్తి అని.. తనపై ఆయన ప్రభావం చాలా ఉందని తెలిపాడు. తను ప్రస్తుతం అట్లీతో చేస్తున్న మూవీ ‘#AA22’పై స్పందిస్తూ.. దర్శకుడు అట్లీ చెప్పిన ఐడియా తనకు చాలా నచ్చింది. ఈ విజువల్ వండర్ ప్రేక్షకులకు సైతం కొత్త అనుభూతిని పంచుతుందని పేర్కొన్నాడు. ఈ వేవ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బన్నీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ వేవ్స్ సమ్మిట్ మే 4 వరకూ జరుగనుంది. ఇప్పటికే చిరంజీవి సహా చాలా మంది స్టార్ హీరోలు ఈ సమ్మిట్‌కు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.