UCC bill:
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మూడు అంశాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలవని తెలుస్తోంది. మొదటిది అయోధ్య రామమందిరం.. రెండోది ఉమ్మడి పౌరస్మృతి.. మూడోది పౌరసత్వ సవరణ చట్టం. ఇంకా ఏమైనా ఉంటే గింగే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లోకి తిరిగి కలపడం. అయితే, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వివాదం రేగుతోంది. కానీ, బీజేపీ పాలన ఉన్నచోట్ల మాత్రం దుందుడుకుగా అడుగులు పడుతున్నాయి. ఈ కోవలోకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం వస్తుంది.
ఎన్నికల మేనిఫెస్టోలోనే బీజేపీ ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తెస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఆ రాష్ట్ర సీఎం ప్రకటనలూ, కార్యక్రమాలూ చేపట్టారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో బిల్లునే ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు సంబంధించి ఉత్తరాఖండ్‌లో మరో అడుగు పడింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అయితే, విపక్షాల ఆందోళనల మధ్యనే దీన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి తీసుకొచ్చారు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తప్పని పరిస్థితుల్లో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఇదీ తేడా..
యూసీసీ అమల్లోకి వస్తే ఏం జరుగుద్ది..? విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అనే సందేహాలు అందరికీ ఉన్నాయి. యూసీసీ అమలైతే గనుక ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అంటే.. ముస్లింలకు ఒకలా, హిందువులకు ఒకలా ఉండవు. మత పరంగా సున్నితం అయినందునే విపక్షాలు బీజేపీ చర్యను శంకిస్తున్నాయి.
తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్..
యూసీసీ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులకెక్కుతుంది. బీజేపీ పాలనలో 2000 సంవత్సరంలో యూపీ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్ ఏర్పడింది. కాగా, గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజీపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్‌సింగ్ ధామి.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు.
రెండేళ్ల కసరత్తు..
యూసీసీ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్ లైన్‌లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. ముసాయిదా నివేదికను ఇటీవల సీఎంకు సమర్పించింది.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…