...

ఇది వారిద్దరి కథ కాదు.. పెద్దవారందరి కథ..

1950, 60ల్లో పుట్టినవారికి 80, 90ల్లో పెళ్లిళ్లు అయ్యుంటాయి. అప్పట్లో చదువుకుని ఉద్యోగాలో, వ్యాపారాలో, వ్యవసాయాలో చేసుకుని జీవితాంతం ప్రయాణం చేసినవారై ఉంటారు. ప్రస్తుత జనరేషన్‌కి తండ్రో, తాతో, అమ్మమ్మో, నాయనమ్మో, అమ్మో, పిన్నో అయిన వారందరూ ప్రస్తుతం ఏం చేస్తుంటారు. మొన్నీ మధ్య నిజమాబాద్‌ జిల్లా వర్ని దగ్గర ఒక పెళ్లిలో ఒక పెద్ద వయసున్న జంటను చూశాను. ఆ జంట గతంలో ఎలా ఉండేవారో వ్యక్తిగతంగా చాలా దగ్గరినుండి చూశాను. వారు బంధువులు కాకపోయినా బంధువుల కంటే ఆప్యాయంగా నన్ను చూసుకునేవారు. ఆ ఇంట్లో పిల్లాడిలా నేను పెరిగాను. ఆ ఇంటి పెద్దాయన ఇంట్లోకి వస్తున్నాడంటేనే ప్రతి ఒక్కరు అలర్ట్‌ అయ్యేవారు. ముఖ్యంగా ఆ పెద్దమనిషి భార్య అయితే ఎంతో బిడియంగా పెద్దాయనతో వ్యవహరించేది. ఆయన అంతే హుందాగా బిహేవ్‌ చేసేవారు. కట్‌చేస్తే కాలచక్రం కాళ్లరిగేలా తనంతట తానుగా గిర్రున తిరిగేసింది. ఓ రెండు సెకన్లలో నా కళ్లముందుకి 20 ఏళ్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.

ఆ పెద్దాయన్ని చూస్తేనే వణికిపోయే ఆ ఇంటి యజమానురాలికి సడెన్‌గా ఎంత ధైర్యం వచ్చింది అనుకున్నాను. ఇంత ధైర్యం ఎక్కడిది అంటే ఆ ధైర్యం ఆమెదికాదు. ఆమె జయించి వచ్చిన కాలానిది. 20 ఏళ్ల క్రితం ఆయనంటే ఉన్న భయం ఇప్పుడు ఆమె మోములో ఏ కోశానా లేదు. దానికి కారణం వారిద్దరి పెద్దరికానికి వచ్చిన తోడు (కంపానియన్‌ షిప్‌) అనే బంధం. పక్షులు గుడ్లుపెట్టి, బిడ్డల్ని కని వాటికి ఆహారం సమకూర్చి రెక్కలు వచ్చి ఆ పిల్లలు ఎగరగలిగేవరకు తోడుంటాయి. ఆ శిషయంలో పక్షుల తల్లితండ్రులైనా, పిల్లల తల్లితండ్రులైనా ఒక్కటే. రెక్కలొచ్చాక ఏటోళ్లు అటు ఎగిరిపోయాక ఆ తల్లితండ్రులు ఎలా ఉండాలి? అనే ప్రశ్నకు సమాధానంగా నాకు వీరు కనిపించారు. 70ల్లోకి వచ్చిన ఏ జంటైనా సరే వీరిలా ఉండాలేమో అనిపించింది. పిల్లలంతా సెటిల్ అయ్యారు. మరి వాట్‌ నెక్ట్స్‌ అని వారనుకుంటే….అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే…ఏం మాట్లాడుకుంటారబ్బా అనే కుతూహలంతో నాకొచ్చిన ఆలోచనకి అక్షర రూపమిది.

నేను మొదటిసారి వాళ్లను చూసినప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కి వాళ్లు వెళ్లినప్పుడు ఎవరిదారి వారిది అన్నట్లు ఉండేవారు. 20 ఏళ్ల ప్రయాణంలో అలా వాళ్లని చూసిన నాకు ఆ ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ 30 మీటర్ల దూరాన్ని 3 నిమిషాలపాటు నడుస్తూ ఉంటే వారికి తెలియకుండా కొన్ని ఫోటోలు తీశాను. ఆ మూడు నిమిషాల్లో ఎన్ని రకాల స్మృతులు నా కళ్లముందుకు వచ్చి గంతులాడోయో నా మస్థిష్కానికే తెలుసు. ఆ పెద్దాయన స్పీడ్, మాట, ఆచరణ వ్యవహారాలు అన్ని ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఆమె బిడియపు చూపులు మాటలు ఒక్కసారిగా నా చెవుల్లో వచ్చిపడ్డాయి. వారిద్దరు పెళ్లైన తొలిరోజుల్లో అంటే దాదాపు 50 ఏళ్ల కిందట చేతిలో చేయ్యేసుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న వారి తొలినాళ్లు గుర్తుకొచ్చాయి. వారిద్దరూ ఇప్పుడు మళ్లీ మనకోసం మనం బతుకుదాం. మళ్లీ మన తొలినాటి రోజులను గుర్తు చేసుకుందాం అంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని ఇన్నేళ్లలో వారు పడిన కష్టాలు, నష్టాలు, ఆనందాలు, బాధలు రోజుకొక్కటి కథలా చెప్పుకునేంత బాహుబలి లిస్టే వారి వద్ద ఉంటుందేమో అనిపించింది.

ఇప్పుడు వారు మరో 30 ఏళ్ల తర్వాత మనం, 50 ఏళ్ల తర్వాత మన పిల్లలు ఇలానే ఉంటామేమో అనే ఆలోచన ఆ మూడు నిమిషాల్లో కలిగింది. ఆ జంటే కాదు.. సమాజంలోని ప్రతి జంట ఇంతేకదా అనిపించింది. వారి ప్లేసులో మరెవరైనా ఉంటే కథలు మారాతాయి, మనుషులు మారతారు కానీ కాలం మాత్రం అందరికి ఒక్కటే కదా అనిపించింది. అందుకే గతం తాలుకూ గుర్తులను గగనమంతా గొప్పగా ఉండేట్లు చూసుకుంటే తలెత్తి చూసిన ప్రతిసారి ఆకాశంలో మనకథలు అందంగా కనిపిస్తాయి. అందుకే మన పెద్ద వాళ్లందరి కథలు బావుండాలని, బావుంటాయని నమ్ముతూ ఈ కథకు ఇన్సిపిరేషన్‌గా నిలిచిన భాస్కర్‌రావు అంకుల్, శ్రీదేవి ఆంటీకి కృతజ్ఞతలు తెలుపుతూ నిండునూరేళ్లు మీరు ఇలానే హాయిగా స్నేహితుల్లా ఉంటూ రియల్‌ కంపేనియన్‌షిన్‌ను ఈ వయస్సులో ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇది వారిద్దరి కథే కాదు. మన కథ, మన తోటివారందరి కథ, పెద్దవారందరి కథ. పెద్ద వయసుకు కావాల్సింది ఆస్థి అంతస్తులే కాదు…మంచి కంపెనీ కూడా అని నమ్ముతూ చిన్న సలహా ఇస్తున్నాను. ఒకవేళ జంట పక్షుల్లో ఎవరో ఒక్కరే ఉంటే మాత్రం పుస్తకం మంచి ఫ్రెండ్‌తో సమానం. పుస్తకాలకు దగ్గరవ్వండి, తోటివారితో స్నేహంగా ఉంటూ ప్రతి ఒక్కరి మంచి కోరుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఫుల్‌ పాజిటివ్‌ ఎనర్జీతో పదికాలాల పాటు జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి.

శివమల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.