ఐపీఎల్ 18వ సీజన్ 39 వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ – కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ 55 బంతుల్లో 90 పరుగులు (10 ఫోర్స్ 3 సిక్సర్లతో) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ జట్టు భారీ స్కోరు సాధించింది. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా 36 బంతుల్లో 53 పరుగులు ( 6 ఫోర్లు, సిక్సర్) సాయంతో తొలి వికెట్ కు 12.2 ఓవర్లలో 114 పరుగులు జోడించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ 23 బంతుల్లో 41 పరుగులు (8 ఫోర్స్) ధాటిగా ఆడటంతో గుజరాత్ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కలకత్తా జట్టు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరటంతో కలకత్తా జట్టుకు కష్టాలు ప్రారంభం అయ్యాయి.
మరో ఓపెనర్ సునీల్ నరైన్ 17 పరుగులు చేసి అవుట్ కావడంతో కలకత్తా కెప్టెన్ అజింక్యా రహానే పైనే భారం పడింది. తను భాద్యతగా బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 50 పరుగులు (5 ఫోర్లు, సిక్సర్) పూర్తి చేసిన తర్వాత అవుటయ్యాడు. వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి టీంను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవ్వరి నుంచి కూడా ఎలాంటి సహకారం లేకపోవడంతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కలకత్తా అభిమానులు నిరాశ పడ్డారు. ఫైనల్ గా కలకత్తాపై గుజరాత్ టీమ్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ సొంతం చేసుకున్నాడు. గుజరాత్ జట్టు నంబర్ వన్ ప్లేస్ లో ఉంది.
శివ మల్లాల