కొత్త పార్టీని ప్రకటించిన తమిళ హీరో
Thalapathy In Politics : తమిళనాడులో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అభిమానులు ‘దళపతి’గా పిలుచుకునే
హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. అందరి సందేహాలకు తెరదించుతూ తన పార్టీ పేరును
కూడా వెల్లడించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. వెట్రి అంటే విజయం, కళగం
అంటే పార్టీ అని అర్థం. అంటే.. తమిళుల విజయానికి తన పార్టీ వేదిక అవుతుందున్న అర్థం వచ్చేలా దీనిని ఏర్పాటు చేసినట్లు
తెలుస్తోంది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోమని విజయ్ తెలిపారు. అలాగని ఇతర ఏ పార్టీకి మద్దతు
ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలోనే తమ జెండా, ఎజెండా ప్రకటిస్తామన్నారు. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలే
తమ లక్ష్యమని వెల్లడించారు. వాస్తవానికి దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఆయన
మాత్రం దీనిపై ఎక్కడా స్పందించలేదు. దీంతో ఇది ప్రచారమేనా? నిజమవుతుందా? అన్న సందేహాలుండేవి. వాటన్నిటికీ ఇప్పుడు
ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇప్పటివరకు ‘పీపుల్స్ మూవ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో సంక్షేమ పథకాలు..
సామాజిక సేవ చేశానని, కానీ.. కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక, ఆర్థిక రాజకీయ సంస్కరణలను తీసుకురావడం
అసాధ్యమని, అందుకు రాజకీయ అధికారం కావాలని…అందుకే తానే స్వయంగా పార్టీ పెడుతున్నానని విజయ్ తెలిపారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి
దురాచారాలు పెరిగిపోయాయన్నారు. వాటన్నింటికి భిన్నంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పునకు నాయకత్వం
వహించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. విజయ్ రాజకీయ పార్టీ ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు
చేసుకుంటున్నారు.
విజయ్ మక్కల్ ఇయక్కం
తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు ప్రజా సంక్షేమ
కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. గతేడాది డిసెంబరులో వరదలతో అతలాకుతలమైన తమిళనాడులోని దక్షిణాది
జిల్లాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు జిల్లాల వారీతగా
నగదు బహుమతులు అందించారు. మరోవైపు ఆయన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ రాజకీయ కార్యక్రమాల్లో
ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ప్రస్తుతం విజయ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయ్యాకే పూర్తి ఫోకస్రాజకీయాలపై పెట్టే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీలో సీఎం స్టాలిన్ తరువాత ఆ స్థాయి నాయకుడు ఇంకెవరూ
లేరనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ..
వారు ప్రజల్లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా
ఉన్న అన్నామలై కొంచెం దూకుడుగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం కూడా అంతగా కనిపించడంలేదు. ఇక విశ్వనటుడు కమల్
హాసన్ కూడా ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టారు కానీ విజయం సాధించలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి..
ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దీంతో తమిళ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని విజయ్
భావించినట్లు తెలుస్తోంది. మరి తమిళగ వెట్రి కళగం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?
