ఓ తల్లి తపన, భావోద్వేగాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘తల్లి మనసు’. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ…అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ చిత్రం మరింత ఎక్కువమంది కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువయ్యి, మంచి ఆదరణ చూరగొంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఫ్రీగా వీక్షించేందుకు కుదరదు. రూ.99 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చు. చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామని ప్రేక్షకులు చెప్పడం తమ యూనిట్ కు ఎంతో ఆనందాన్నికలిగించిందని , ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారం ద్వారా మిగతా ప్రేక్షకులకు దగ్గరై, తాము ఏదైతే చిత్రం గురించి ఆశించామో ఆ లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రజావాణి చీదిరాల