విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అది రీ యూనిమన్ అంటారు. అదే పాతతరం జర్నలిస్ట్‌లందరూ ఓ వేదికపైకొస్తే అది జర్నీయూనియన్ అనాలేమో. అలాంటి గొప్ప కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో స్వాతిముత్యం సిల్వర్‌జూబ్లి వేడుకలో జరిగింది. కొన్ని కార్యక్రమాలు మనం చేసిన పనిని పదేపదే గుర్తు చేసి జీవిత గమనంలో మనం ఎన్నుకున్న వృత్తి సరైనదే అని మనల్ని, ఉద్యోగరీత్యా మనం చేసిన అనుభవాలను తట్టి లేపి ఓ సారి గుర్తు చేస్తాయి. సీనియర్ సినిమా జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజి తన సొంత మీడియా సంస్థ స్వాతిముత్యం వార్షికోత్సవం సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు, సీనియర్ ఫోటో జర్నలిస్ట్‌లకు, పీఆర్వోలకు అవార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండే రోజుల నుంచి ఇప్పటి వరకూ ఉన్న తెలుగు జర్నలిస్ట్‌లందరినీ ఆహ్వానించి వారందరిని తగురీతిలో సన్మానించారు.
ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించి దిగ్విజయంగా పూర్తిచేయటం ఎంతో గొప్ప విషయం. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పనిని సక్రమంగా పూర్తి చేసి శహభాష్ అనిపించుకోవటం అప్పాజీకి అలవాటుగా మారిందనే చెప్పాలి. ఈ అవార్డు ఫంక్షన్ కోసం చాలామంది లబ్ద ప్రతిష్టులు ఎక్కడెక్కిడి నుంచో వచ్చి తమ తోటి జర్నలిస్ట్‌లందరిని కలుసుకుని వారందరితో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారి మోములో కనిపించిన ఆనందం వెలకట్టలేనిది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు మురళీమోహన్, నిర్మాతలు దామోదర్ ప్రసాద్, టి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొని జర్నలిస్ట్‌లతో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు స్వాతిముత్యం అధినేత అప్పాజీతో పాటు కార్యక్రమం ఇంత గొప్పగా జరగటానికి కారకులైన సీనియర్ జర్నలిస్ట్ ప్రభును కొనియాడారు.
శివమల్లాల