Suspension of constructions:
జీవో నంబర్ 59.. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని నివాసముంటున్న పేదలకు గూడును దూరం చేయకుండా.. ఆ భూమిపై వారికే హక్కు కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వు ఇది.
ఈ జీవో కింద నామమాత్రపు ఫీజుతో.. రాష్ట్రంలో, ప్రత్యేకించి జీహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారు.
ఆయా భూముల్లో ఇంటి నిర్మాణం జరుపుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న వారు.. ఆ విషయాన్ని ధ్రువీకరించడంతోపాటు ఇన్నాళ్లుగా విద్యుత్తు బిల్లు లేదా నల్లా బిల్లు చెల్లిస్తున్నట్లుగా రశీదును ఇందుకోసం సమర్పించాల్సి ఉంటుంది.
అయితే.. కొందరు అక్రమార్కులు ఈ జీవోను దుర్వినియోగం చేసి.. విలువైన ప్రభుత్వ భూములను తమ పేరిట క్రమబద్ధీకరణ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆయా భూముల్లో ఎటువంటి నిర్మాణం జరపకపోయినా.. తమ ఆక్రమణలో ఉన్న భూమికి బినామీల పేరిట క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేయించారు.
ప్రత్యేకించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. కొందరు అధికారులతో కుమ్మక్కై భూములపై హక్కులు పొందారు.
అయితే ప్రభుత్వం మారిపోవడం, అక్రమార్కుల వ్యవహారాలు వెలుగులోకి వస్తుండడంతో..
క్రమద్ధీకరణలో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చాలని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.
దీంతో అక్రమంగా ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరింప జేసుకున్న వారిలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.
జీవో 59 కింద భూమిని క్రమబద్ధీకరణ చేయించుకున్నవారు అందుకోసం ఫీజు చెల్లిస్తే.. ప్రభుత్వం ఆ ఫైలును పరిశీలించి.. అన్నీ వాస్తవమేనని నిర్ధారణ అయితే దానిని ఆమోదిస్తుంది.
సదరు దరఖాస్తుదారు పేరిట ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియలోనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో..
వాటిని నిగ్గు తేల్చేందుకుగాను ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయిన స్థలాలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ రీ వెరిఫికేషన్ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది.
రీ వెరిఫికేషన్ లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే క్రమబద్ధీకరణను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది.
ఒకవేళ ఫీజుల చెల్లింపు మాత్రమే పూర్తయి, రిజిస్ట్రేషన్ పూర్తికాకుండా కన్వేయన్స్ డీడ్ జారీ చేయకుండా ఏవైనా ఫైళ్లు ఉంటే.. వాటిని అదే దశలో నిలిపివేయనుంది.
ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. రీ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు జీవో 59 కింద క్రమబద్ధీకరణ జరిగిన భూముల్లో నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు కూడా ఇవ్వవద్దని ఆదేశించింది.
దీంతో ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అనుమతులు నిలిపేయాలని పేర్కొన్నారు. దీంతో జీవో 59 పేరుతో అక్రమంగా ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నట్ల తెలుస్తోంది.
Also Read :ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?