Special focus on Kodangal:
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కడా)ను ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేక అధికారిని నియమించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ నియోజకవర్గానికి ప్రభుత్వ మహిళా ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కారు.. అందులో మొట్టమొదటి కాలేజీని కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్రంలోనే తొలి మహిళా ఇంజినీరింగ్ కాలేజీ కావడం గమనార్హం.
కోస్గిలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు వెలువరించారు. 2024-2025 విద్యా సంవత్సరం నుంచే కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఇంజినీరింగ్ కాలేజీలో మొదట 3 బీటెక్ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నాయి.
బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్‌ఈ (డేటా సైన్స్).. 3 కోర్సులను ప్రారంభించనున్నారు.
ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు ఈ కాలేజీలో ఉండనున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలన్నీ ఆయా విశ్వవిద్యాలయాల కిందే పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ కోస్గి ఇంజినీరింగ్ కళాశాల మాత్రం తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయనుంది.
బోధన, బోధనేతర సిబ్బంది నియామకం
ఈ కాలేజీలో మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వారి వేతనాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను సాంకేతిక విద్యాశాఖ చేపట్టనుంది.
నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఏదైనా ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండాల్సి ఉంటుంది.
అంటే.. ఒక వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యూనివర్సిటీ రూపొందించిన సిలబస్‌ను పాటించాల్సి ఉంటుంది.
పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ వంటి వాటిని ఆ యూనివర్సిటీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ.. జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా, కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసినా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఎప్పటిలాగే యథాతథంగా కొనసాగనున్నాయి.
2014 లో 5 ఎకరాల విస్తీర్ణంలో కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అక్కడ సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీల్లో మొత్తం 180 డిప్లమా సీట్లు ఉన్నాయి. వాటికి అదనంగా ఈ బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు విద్యాబోధన చేస్తున్న లెక్చరర్లు బీటెక్ విద్యాబోధనకు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇక త్వరలో ఏర్పాటు కానున్న మిగిలిన 10 ఇంజినీరింగ్ కాలేజీలు కూడా పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేయనున్నవే.
వీటిలో.. హైదరాబాద్ లోని చందులాల్ బరాదరిలో ఉన్నఖులీఖుతుబ్‌షా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, మారేడుపల్లి లోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మాసాబ్‌ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, గచ్చిబౌలి లోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీతోపాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి.