Sneha Geetham:స్నేహగీతానికి పన్నెండేళ్లు…

Sneha Geetham:

సినిమా అనే మాయలోకంలో విహరించటానికి ఎవరు పనికట్టుకుని చేతబడి చేయనవసరం లేదు.

ప్రతి ఒక్కరు ఎవరిస్థాయిని (ఇక్కడ స్థాయి అంటే పిచ్చి అని) బట్టి వారు ఆ మంత్రాన్ని జపిస్తూ, తపిస్తూ ఫిల్మ్‌నగర్‌ అనే చెట్టు కిందకు చేరతారు.

ఈ చెట్టు కిందకు చేరటానికిఒక్కొక్కరు ఒక్కో ముసుగు వేసుకుని ఒక్కో పని చేస్తుంటారు. ఇతను ఎం చేస్తున్నాడని గమంచేవారంతా

అతను అదేదో పని చేస్తున్నాడులే అనేవిధంగా ఎదో ఒక పనీలో నిమగ్నమై ఉంటారు. అలాంటి కొన్ని వందల, వేల కథల్లో ఇదో చిన్న కథ. ఈ కథ మధురా శ్రీధర్‌ అనబడే పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కమ్‌ సినిమా దర్శకుని కథ.

అనగనగనగా… వరంగల్‌ పట్టణంలో బాగా చదువుకున్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఒకతను అప్పుడప్పుడే సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి పేరుప్రఖ్యాతులున్న ఇన్ఫోసిస్‌ అనే రాజ్యంలో

ఉద్యోగం చేసుకుంటూ ఇన్ఫోసిస్‌ రాజు దగ్గర మంచి సైనికునిలా పనిచేస్తుండేవాడు. ఇతని పనితనానికి మెచ్చిన రాజు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.

కంపెనీలో చేరిన కొద్ది రోజుల్లోనే తన టాలెంట్‌తో పదోన్నతి సాధించి సౌతాఫ్రికా చేరుకున్నారాయన.

అంతా బావుంది కదా అనుకుంటున్న సమయంలో ఆయనకు చిన్నప్పుడు చిరంజీవి ‘అభిలాష’ సినిమా చూస్తున్నప్పుడు ‘‘బంతి చేమంతి ముద్దాడుకున్నాయి…’’ అనటంలో ఎక్కడో చిరంజీవికి, సినిమాకి కనెక్ట్‌ అయ్యారు శ్రీధర్‌.

Sneha Geetham-02
Sneha Geetham-02

ఇంటర్మీడియట్‌ చదువుతున్న టీనేజ్‌ కుర్రవాడికి సినిమా పురుగు కుట్టింది. ఎలాగైనా, ఎప్పటికైనా తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ పేజి రాసుకోవాల్సిందే అని గట్టిగా అనుకున్నారాయన.

అనుకుందే తడవుగా రాజుతో ప్రేమగా తెగతెంపులు (భారీ మొత్తాన్ని తీసుకుని) చేసుకుని తనకు ప్రేమ ఉన్న సినిమా రంగంలో కాలుమోపారాయన.

వచ్చాక రోజుకో కథ, మనిషికో కథలా కనిపించటంతో తనకు ఎంతో ఇష్టమైన పాటతో అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి దగ్గరవ్వొచ్చు

అనే ఉద్ధేశ్యంతో మధురా ఆడియో అనే సంస్థను తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి స్థాపించారు.

సినిమా వారికి ఇంకా దగ్గరవ్వాలని అప్పటికే వెలుగులో ఉన్న సినీస్టార్‌ అనే మ్యాగజైన్‌ని సొంతం చేసుకుని సినిమా వారితో కలిసి నడవటం ప్రారంభించారు ఆ సామాన్య సినిమా ప్రేమికుడు.

ఇది అతని కథలోని మొదటిపార్టు. ఇక అక్కడినుండి తన టార్గెట్‌ అంతా చిన్నప్పటినుండి కన్న కలను నెరవేర్చుకోవటానికి ఏం చేయాలి? ఎవరి ద్వారా,

ఎలాంటి కథతో నేను డైరెక్టర్‌ ఇలాంటి అనేక ప్రశ్నలతో సతమతమవుతున్న శ్రీధర్‌కి మరో శ్రీధర్‌ తోడయ్యారు.

తాను అనుకున్న ‘స్నేహగీతం’ కథను నిర్మాత లగడపాటి శ్రీధర్‌కి చెప్పి ఒప్పించి తన కలను నిజం చేసుకుంటూ కొబ్బరికాయ కొట్టి ‘స్నేహగీతం’ చిత్రాన్ని కొత్త నటీనటులతో ప్రాంభించారు శ్రీధర్‌లిద్దరు.

అప్పటినుండి మధురా ఆడియో శ్రీధర్‌ పేరు దర్శకుడు శ్రీధర్‌గా ప్రేక్షకుల్లోకి దగ్విజయంగా దూసుకెళ్లారాయన. సినిమా చేస్తున్నప్పుడు కూడా అనేక పురిటి నొప్పులు.

అవన్నీ దాటుకుని బిడ్డలాంటి సినిమా బయటకు వచ్చిందిలే అనుకుంటే సినిమా అలా ఉంది, ఇలా ఉంది ఎన్నో అవమానకరమైన రాతలు.

Sneha Geetham
Sneha Geetham

ఇలా ఒక్కటేమిటి సినిమా కష్టాలంటే ఏంటో ప్రత్యక్షంగా చూడాలంటే ఇటువంటి ఎక్స్‌పీరియన్స్‌ ఒక్కటైనా ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క సినిమావాడికి ఎదురయ్యే విషయమే.

సినిమా విడుదలై ఇప్పటకి 12 ఏండ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ సినిమా గురించి ఆలోచిస్తే ‘స్నేహగీతం’ సినిమా వల్ల ఏం సాధించారు శ్రీధర్‌లిద్దరూ అని అనుకుంటే.

ఈ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ‘‘లైఫ్‌ ఈజ్‌ ఏ ఛాన్స్, లివింగ్‌ ఈజ్‌ ఏ ఛాయిస్, సో ఫాలో ది హార్ట్‌ ఫ్యూచర్‌ ఈజ్‌ యువర్స్‌…’ అనే డైలాగ్‌లో చెప్పినట్లుగా

ఆ సినిమాకు పనిచేసిన నిర్మాత, దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ అక్షరాల సినిమాలో డైలాగ్‌లా బతికేస్తున్నారంతా.

 

ముఖ్యంగా ఆ సినిమాలో పనిచేసిన నటీనటులు తర్వాత కాలంలో ప్రామిసింగ్‌ నటులగా మారిన సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

హీరోగా సందీప్‌కిషన్‌ ‘స్నేహగీతం’ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు.

అలాగే ఆ సినిమాలోని డైలాగులు అందించి ఒన్‌ ఆఫ్‌ ది హీరోగా నటించిన వెంకీ అట్లూరి వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’తో దర్శకునిగా

మెగాఫోన్‌ పట్టి పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అఖిల్‌ అక్కినేనితో ‘మిస్టర్‌ మజ్ను’, నితిన్‌ హీరోగా ‘రంగ్‌దే’ ను తెరకెక్కించి

ప్రస్తుతం ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళ్‌లో ‘సర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తూ పెద్ద దర్శకుల సరసన నిలుచున్నారు వెంకీ అట్లూరి.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రేయా ధన్వంతరి బాలీవుడ్‌లో చక్కని పాత్రలు చేస్తుంది.

ఈ సినిమాతో పేరు సంపాదించిన సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ 50 సినిమాలకు పనిచేశారు.

‘స్నేహగీతం’ సినిమా కోసం అమెరికా నుండి వచ్చిన ‘వెన్నెల’ కిశోర్‌ ఇక అమెరికా వెళ్లే అవసరం లేకుండా ఇండియాకు మకాం మార్చటానికి దారులు వేసిన చిత్రమే ‘స్నేహగీతం’.

నటుడు చైతన్యకృష్ణ ఎంతో మంచి నటునిగా పేరు సంపాదించి ఓటీటీలో ప్రస్తుతం వస్తున్న అనేక సినిమాలకు పెద్ద హీరో అయ్యిడు.

ఇలా ఒకటా, రెండా చెప్పుకుంటే పోతే అనేక తీపి గుర్తులు ఈ సినిమాద్వారా తమ గుండెల్లో దాచుకున్నారు నిర్మాత లగడపాటి.

శ్రీధర్, దర్శకుడు మధురా శ్రీధర్‌. ‘స్నేహగీతం’ అనే సినిమా చాలామంది తెలుగు నటీనటుల, టెక్నిషియన్ల జీవితానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదేమో.

ఇలాంటి అనేక స్నేహగీతాలను గుర్తు చేసుకుంటూ ఆ టీమందరికి పుష్కర శుభాకాంక్షలు.

శివమల్లాల………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *