Dil Raju :
కేరళ తరహాలో గడువు విధించాలంటున్న దిల్ రాజు
‘సినిమా రివ్యూ’ .. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తున్న అంశమిది.
ఏదైనా కొత్త సినిమా విడుదలైతే.. గంటల వ్యవధిలోనే సమీక్షకులు దానిని విశ్లేషిస్తూ రివ్యూ రాస్తుండడంతో ప్రేక్షకులు ఆ రివ్యూలను చదివి ఓ అంచనాకు వచ్చిన తరువాతే సినిమా చూడాలో, వద్దో నిర్ణయించుకుంటున్నారు.
దీంతో రివ్యూల ప్రభావం సినిమాల కలెక్షన్లపై పడుతోందని నిర్మాతలు అంటున్నారు.
వాస్తవానికి సినిమాలో కంటెంట్ ఉంటే.. రివ్యూలు రాసేవారు కూడా వ్యతిరేకంగా రాయడానికి ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు తమ దృష్టి కోణంతో నెగిటివ్ రివ్యూ రాసినా.. సినిమా బాగుంటే మౌత్ టాక్ తోనే ప్రేక్షకులకు చేరువవుతుంది.
అప్పుడు ఏ రివ్యూలు దాని విజయాన్ని ఆపలేవు. కానీ, ఎటొచ్చీ సినిమాలో ‘విషయం’ లేనప్పుడే ఈ సమస్యలు తలెత్తుతాయి.
రివ్యూలు రాయకపోతే.. ఫలానా హీరో సినిమా అనో, కాంబినేషన్ ను చూసో ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడని, దాంతో ఓపెనింగ్స్ అయినా వస్తాయన్నది నిర్మాతల భావన.
అయితే రివ్యూ రాసేవారు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెబుతారని, అందరి అభిప్రాయం, అభిరుచి ఒకేలా ఉండాలన్న రూలేమీ లేదన్నది సమీక్షకుల వాదన.
కానీ, మంచి సినిమాకు కూడా కొందరు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ.. ఉద్దేశపూర్వకంగా సినిమాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ పై ఇలాంటి వివాదమే తలెత్తిన విషయం తెలిసిందే.
ఫ్యామిలీ స్టార్ కుటుంబ సమేతంగా అందరికీ నచ్చే, అందరూ మెచ్చే సినిమా అని, చూసిన ప్రేక్షకులు కూడా ఇదే విషయం చెప్పారు.
ఈ సినిమాపై విడుదలకు ముందునుంచే నెగిటివిటీని ప్రచారం చేశారని నిర్మాత దిల్ రాజు వాపోయిన విషయమూ తెలిసిందే.
ఎవరిపై కోపంతోనో ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం వల్ల సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందని దిల్ రాజు అన్నారు.
చివరికి హీరో విజయ్ దేవరకొండ మేనేజర్, ఆయన అభిమాన సంఘం నాయకుడు కలిసి.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోవాలని, కొన్ని వెబ్ సైట్లలో, యూ ట్యూబ్ చానళ్లలో సినిమాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. ఉద్దేశపూర్వకంగా నష్టం చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరి పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ.. ఫ్యామిలీ స్టార్ పై నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగలేదు.
ఫలితంగా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేక డిజాస్టర్ గా మిగిలిపోయే పరిస్థితులు తలెత్తాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే దిల్ రాజు.. రివ్యూలపై మరోసారి గళం విప్పారు.
బాగాలేని సినిమాకు ప్రేక్షకులు రాకపోతే.. తాము తప్పు తెలుసుకొని అంగీకరిస్తామని, తరువాత తీసే సినిమాకు ఆయా లోపాలను సవరించుకునే ప్రయత్నం చేస్తామని,
కానీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాను రివ్యూల పేరుతో దెబ్బతీయడం ఇండస్ట్రీకే మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
కేరళలో ఇలా రివ్యూల వల్ల సినిమాపై ప్రభావం పడకుండా ఉండేందుకు.. సినిమా విడుదలైన మూడు రోజుల దాకా ఎటువంటి రివ్యూలు ఇవ్వకుండా ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరి దిల్ రాజు అభిప్రాయంతో ఎంత మంది ఏకీభవిస్తారో, సమీక్షలు రాసేవారి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Also Read This Article : ఫోన్ ట్యాపింగ్ అందరూ చేసేదే?