Sarangapani Jathakam :
చిత్రం: సారంగపాణి జాతకం
విడుదల: 25-04-2025
నటీనటులు : ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు
బ్యానర్ : శ్రీదేవీ మూవీస్
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకుడు : మోహనకృష్ణ ఇంద్రగంటి
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీచూసి భలే ఉన్నాయి అనుకుంటూ పదిమందికి ఆ సినిమా చూడమని చెబుతున్నాం. అలా చూసిన ప్రతి ఒక్కరూ ఓ పదిమందికి బాగుందని చెప్పే తెలుగు సినిమా ఈ రోజు విడుదలయ్యింది. ఆ సినిమా పేరు ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఒక సింపుల్ కథని రెండు గంటల పదిహేను నిమిషాల్లో ఎలా చెప్పొచ్చో అంత చక్కగా దర్శకుడు ఇంద్రగంటి చెప్పారు. కథగా చెప్పాల్సి వస్తే ఎంతో చిన్న కథ. ప్రతి చిన్న విషయానికి జాతకాలు నమ్మే హీరో సారంగపాణి (ప్రియదర్శి)కి అసలు జాతకాల పట్టింపులేని హీరోయిన్ మైథిలి (రూపా కొడవాయుర్)కి పెళ్లి ఫిక్సవుతుంది. అక్కడి నుంచి సినిమా కష్టాలు మన హీరోకి ప్రారంభమవుతాయి. అక్కడ నుంచి సారంగ, మైథిలి కోసం ఏంచేశాడు? వారి పెళ్లికి వచ్చిన ఆటంకాలేంటి? ఎవరు వారి పెళ్లికి అడ్డుగా నిలిచారు? ఇలాంటి విషయాలన్ని తెలుసుకోవాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.
ఎవరు ఎలా చేశారు?
సినిమా పరంగా చూస్తే ప్రియదర్శి తర్వాత పెద్ద క్యారెక్టర్ ‘వెన్నెల’ కిశోర్ పాత్రే. ఇలాంటి పాత్రలను పండించటంలో కిషోర్ మాస్టర్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ రూపకూడా ఎంతో బాగా నటించారు. గ్లామర్ పాత్రలు కాకుండా ఇలాంటి కంటెంట్ ఉన్న పాత్రలకు దర్శకులకు పర్‌ఫెక్ట్ యాప్ట్‌లా రూప కనిపించారు. ఇక అవసరాల శ్రీనివాస్‌కి ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ లభించింది. ఆయనకిది ఒక వెరైటీ జానర్ మాత్రమే కాకుండా మునుపెన్నడూ కనిపించని విధంగా చాలా కొత్తగా కనిపించారు. సెకండ్‌హాప్‌లో వచ్చి సందడి చేసిన ‘వైవా’ హర్ష పాత్ర కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. నరేష్, రూపాలక్ష్మీ, తనికెళ్లభరణి, వడ్లమాని శ్రీనివాస్, కల్పలత, శివన్నారాయణ, అశోక్‌కుమార్, రాజా చెంబోలు వారివారి పాత్రల్లో చక్కగా నటించారు.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
సినిమాలోని కథపరంగా పెద్దగా హడావిడి చేయకుండా తన కెమెరా పనితనంతో కథని అందంగా చూపించే ప్రయత్నం చేశారు కెమెరామెన్ పి.జి విందా. వివేక్ సాగర్ సంగీతంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు కూడా బావుంటే బావుండేది. అలాంటి మంచి పాటలు లేకపోటవం ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. అన్నిటికంటే ఈ సినిమాకి స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్ డైలాగ్స్. ఖచ్చితంగా ఇంత ఒక కంటెంట్‌ని క్రియేట్ చేస్తూ ఆ కంటెంట్‌కి తగినట్లుగా కామెడి డైలాగులు రాయటం పెద్ద చాలెంజ్. అలాంటి చాలెంజ్‌ను అవలీలగా అధిగమించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అసలు సిసలు తెలుగు కంటెంట్‌ఫుల్ సినిమా ‘సారంగపాణి జాతకం’.
సినిమా ప్లస్‌లు
నటీనటుల పనితీరు
ఇంద్రగంటి మోహనకృష్ణ డైలాగ్స్
మైనస్‌లు
వీక్ లవ్‌స్టోరీ
ఫస్టాఫ్ స్లోగా ఉండటం..
ఫైనల్ వర్డిక్ట్..
ఈ జాతకాన్ని థియేటర్‌లో చూడటం వల్ల మన జాతకానికి వచ్చే నష్టమేమి లేదు.
రేటింగ్– 3/5
శివమల్లాల
Also Read This : ఒక్క ట్వీట్‌తో కాక రేపిన ‘రాజాసాబ్’ డైరెక్టర్
