Sania mirza news :
అది రెండు జీవితాలను ముడివేసిన బంధమే కాదు.. రెండు అత్యంత ప్రాచుర్య క్రీడల కలయికే కాదు.. రెండు దేశాల వారిని ఏకం చేసిన వివాహ బంధం.. అలాంటి అనుబంధానికి ముగింపు కార్డు పడింది.
ఏడాదినుంచి సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇద్దరు క్రీడా ప్రముఖుల జీవితాలు వేరుపడ్డాయి.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ దంపతులు విడిపోయారు.
మాలిక్.. మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మాలిక్.. 1999 అక్టోబరు 14 తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు.
మొత్తం కెరీర్ లో 287 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 7,500 పరుగులు, 158 వికెట్లు పడగొట్టాడు. 35 టెస్టుల్లో 1898 పరుగులు చేశాడు. 38 వికెట్లు తీశాడు. 124 టి20ల్లో 2,435 పరుగులు చేశాడు.
అన్నిటికి మించి మాలిక్ రెండేళ్ల కిందటి వరకు. అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్నాడు. వచ్చే ఫిబ్రవరి 1తో 42 ఏళ్లు పూర్తిచేసుకోనున్న అతడు.. 1990ల్లో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టి 2020
తర్వాత కూడా కొనసాగిన రెండో క్రికెటర్ (క్రిస్ గేల్ మొదటివాడు)గా రికార్డుల్లో నిలిచాడు. 2019 తర్వాత అంతర్జాతీయ వన్డేల్లో అతడికి అవకాశం రాలేదు.

మూడో పెళ్లి..
మాలిక్ 2002లోనే ఆయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. ఆమెతో సంబంధం తెంచుకుని 2010లో భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరికి ఒక అబ్బాయి. కాగా, కెరీర్, వ్యక్తిగతంగా ఇబ్బంది లేకుండా ఇద్దరూ దుబాయ్ లో ఉంటూ తమ తమ దేశాలకు వస్తూ పోతుండేవారు. మరోవైపు సానియాకు 2009లో హైదరాబాద్ కరాచీ బేకరీ యజమాని కుమారుడితో నిశ్చితార్థం జరిగినా.. కొంత కాలానికి రద్దయింది. ఆ తర్వాత మాలిక్ తో వివాహం కుదిరింది.
హైదరాబాద్ లోనే మాలిక్ ను పెళ్లాడింది. రెండేళ్లుగా ఈ జంట విడిపోనున్నట్లు కథనాలు వస్తున్నా.. నిర్ధారణ కాలేదు. రెండు రోజుల కిందట మాత్రం సానియా విడాకులపై పరోక్షంగా ప్రకటన చేసింది. విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ వార్త బయటకు రాగానే.. మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు అతడి సోషల్ మీడియా ఖాతాల ద్వారా బయటపెట్టాడు. అది వైరల్గా మారిన తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి ప్రకటన చేశాడు. సానియా-మాలిక్ లకు 2018లో కుమారుడు జన్మించాడు. మరోవైపు నటి సనా జావేద్కు కూడా ఇంతకుముందే వివాహం జరిగింది. 2020లో పాక్ పాటగాడిని పెళ్లిచేసుకున్న ఆమె.. 2023లో విడిపోయింది.
హైదరాబాద్ లోనే సానియా..?
సానియా మీర్జా తన జీవితాన్ని హైదరాబాద్ లోనే గడిపేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీని పెళ్లి చేసుకున్నప్పటికీ.. భారత దేశంపై, హైదరాబాద్ నగరంపై గతంలోనే ఆమె తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి ఆమె ఎక్కడ ఉంటారనే చర్చ నడుస్తోంది. సానియా మాత్రం హైదరాబాద్ లోనే స్థిరపడిపోయే చాన్సుంది.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?
