Samantha: ‘శుభం’లో కేమియో రోల్ అందుకే చేశా..

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. ‘‘నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. కానీ నిర్మాతగా మాత్రం నాకు ఇదే తొలి శుక్రవారం కావడంతో చాలా నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయనేది నాకిప్పుడు క్లియర్‌గా తెలుస్తోంది. వారం రోజులుగా నిద్రలేని రాత్రులను పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ అంతా గడుపుతున్నాం. కెరీర్ మొదలు పెట్టి 15 ఏళ్లు గడిచింది. నటిగా ఎంతో అభిమానం లభించింది.. ఎంతో చూశా. ఇంకా ఏదో చేయాలనే తపన, కోరికతో నేను తీసుకున్న ఏడాది బ్రేక్ టైంలో చాలా ఆలోచించాను. ఈ ఏడాది కాలంలో హీరోయిన్‌గా ఏ సినిమాలు చేయలేకపోయాను. ఇక ముందు కూడా నటిస్తానో లేదో తెలియని సమయంలో నిర్మాతగా మారాలన్న ఆలోచన వచ్చింది.

నటించకపోతేనేం సినిమాలు నిర్మించొచ్చు కదా అని అనుకుని ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించి 8 నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి ఓ కారణం ఉంది. ఈ చిత్రంలో ప్రధానంగా సీరియల్ గురించి ఉంటుంది.. దానికి ఎప్పుడు శుభం కార్డ్ పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కారణం.. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ‘ట్రా లా లా’ అని పెట్టాం. గౌతమ్ మీనన్ గారు నాకు తొలి ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన తల్చుకుంటే ఏ టాప్ హీరోయిన్‌ అయినా నటించేవారు కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అందుకే నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే భావిస్తున్నా.

నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులు ముఖ్యంగా తొలి క్లాప్ గుర్తొచ్చింది. నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ తెలియలేదు కానీ ప్రస్తుతం నిర్మాతగా ఉండటంతో ఒక్క రోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుందనేది తెలుస్తుంది. ‘శుభం’ చిత్రంలోని కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు కానీ నా సినిమాకు నిర్మాతగా తొలిసారి ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే కేమియో రోల్ చేశా. ‘శుభం’ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాం. అనుకున్న దాని కంటే కొంత ఎక్కువే అయ్యింది. ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నా. ఆ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. అది స్టార్ట్ అయితే అప్‌డేట్స్ ఇస్తాం. అట్లీ గారితో నాకు చాలా మంచి స్నేహం ఉంది. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిన ఆధారంగా చేసుకునే ఈ సినిమాను తీశాం. ఇది జనరల్ హారర్, కామెడీ అనేలా ఉండదు కానీ ఇదొక సోషల్ సెటైర్.

నాకు నేనే ఓ పెద్ద విమర్శకులురాలిని. కాబట్టి నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా కష్టపడి.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను కట్ చేశాం. నేను ఎప్పుడైనా కూడా నా మనసుకు నచ్చిందే చేశాను. నేను ఓ స్మార్ట్ ప్రొడ్యూసర్‌ని కాకపోవచ్చు.. అలాగే నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ ఈ సినిమా అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఓ అభిమాని నాకోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నాపై వారు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, పూజలు చేసే పద్ధతిని మాత్రం ఎంకరేజ్ చేయలేను. మా సినిమాకు సమ్మర్ హాలిడేస్‌లో మంచి డేట్ దొరికింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు ఈ డేట్ దొరకడం మా అదృష్టం. మా సినిమా మే 9న విడుదల కాబోతోంది. తప్పక చూడండి’’ అని సమంత తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *