Russia – Ukraine War :
ఇప్పటికి సరిగ్గా రెండు సంవత్సరాల పది రోజులు.. ఆరని కాష్టంలా రగులుతూనే ఉంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. వేలమంది మరణం.. లక్షల మంది వలస.. లక్షల కోట్ల ఆస్తి నష్టం.. అయినా ఎక్కడా సమీప భవిష్యత్తులో యుద్ధ విరమణ కనిపించడం లేదు. ఏనుగు లాంటి రష్యా ముందు ఉక్రెయిన్ చిట్టెలుకే కావొచ్చు.. కానీ, తనదైన శైలి ప్రతిఘటనతో చికాకుపెడుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఓ అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఈ సంఘటన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేదే..?
అధ్యక్షుడు-ప్రధాని మధ్యలో క్షిపణి
2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగింది. ఇటీవల ఈ యుద్ధానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ కు పలు దేశాల అధినేతలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. వీరిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు కూడా ఉన్నారు. తాజాగా గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి ఆయన తీర నగరం ఒడెస్సాలో పర్యటిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో రష్యా క్షిపణి వారి కాన్వాయ్ కు 500 మీటర్ల దూరంలో పడింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నాటో దేశ ప్రధానికి హాని జరిగితే..
గ్రీస్ 1952 నుంచి నాటో సభ్య దేశం. అంటే 72 ఏళ్లుగా నాటో కూటమిలో భాగస్వామి. తమ కూటమిలోని ఏ దేశానికైనా ఆపద వాటిల్లితే.. నాటో దేశాలన్నీ ఏకమై ప్రత్యర్థి అంతుచూస్తాయి. ఈ లెక్కన గ్రీస్ ప్రధానికి ఏమైనా జరిగి ఉంటే.. అమెరికా, బ్రిటన్ సహా రష్యాపై కాలుదువ్వేవి. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేది. అయితే, ఒడెస్సాలోని హ్యాంగర్ ను తాము పేల్చివేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిపింది.
ఆ చెస్ దిగ్గజం ఉగ్రవాది
గ్యారీ కాస్పరోవ్ అంటే చదరంగ దిగ్గజం. భారత్ కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ తో పోటాపోటీగా తలపడి.. ప్రపంచ చెస్ ను ఏలినవాడు. అలాంటి కాస్పరోవ్ ను రష్యా ‘ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది. కాస్పరోవ్.. రాజకీయంగా అభిప్రాయాలను బలంగా వినిపిస్తుంటారు. పుతిన్ విధానాలను ఎండగడుతుంటారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండించారు. కాగా, ఉగ్రవాదుల జాబితాలోని వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు ఉంటాయి. ఖాతాలను వాడాలంటే ప్రతిసారి అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే, కాస్పరోవ్ 2014లోనే రష్యాను విడిచివెళ్లిపోయారు.
అమెరికా వద్ద రష్యా తెల్ల ఏనుగు
బాబోయ్ అంటూ .. నెలకు మిలియన్ డాలర్లు ఖర్చుతట్టుకోలేక రష్యా సంపన్నుడు సులేమాన్ కెరిమోవ్ కు చెందిన నౌకను అమెరికా వదిలించుకోవాలని చూస్తోంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైన సమయంలో పుతిన్ కు సన్నిహతుడైన సులేమాన్ విలాస నౌకను 2022లో ఫిజీ తీరంలో అమెరికా టాస్క్‌ఫోర్స్ సీజ్ చేసింది. 348 అడుగుల పొడవుండే ఈ నౌక పేరు ‘అమాడెయా’.
బంగారం వ్యాపారి అయిన కెరిమోవ్ నౌక నిర్వహణ ఖర్చుల కోసం ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకొన్నట్లు ఆరోపించింది. శాన్‌డియాగో తీరంలో ఉన్న ఈ నౌకను విక్రయించేందుకు అనుమతించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు జడ్జిని కోరారు. ఇప్పటివరకు 20 మిలియన్ డాలర్లను దీని నిర్వహణకు వెచ్చించినట్లు పేర్కొన్నారు. నౌక విలువ 230 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.
