‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంత మేకర్స్ అధికారిక ప్రకటన వస్తే తప్ప ప్రచారాలను నమ్మవద్దని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఏ వార్త వినిపించినా నిజమేనేమో అన్నట్టుగా చూస్తున్నారు. ఈ సినిమా జూలై తొలి వారంలో విడుదల కానుందంటూ కొందరు తెగ ప్రచారం చేస్తుంటే.. మరికొందరేమో జూన్ 26న విడుదల కానుందని చెబుతున్నారు. జూన్ 26న విడుదలంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సైతం పోస్ట్ పెట్టింది.
మొత్తానికి విడుదల తేదీ విషయమై చక్కర్లు కొడుతున్న పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ ‘హరి హర వీరమల్లు’ మేకర్స్‌కి ఈ విషయమై స్పందించక తప్పలేదు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ వెల్లడించింది. ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయ కారణాల వల్ల సినిమా తెరకెక్కడం ఏళ్ల పాటు ఆలస్యమైంది. దీంతో బడ్జెట్ కూడా తడిసి మోపెడవంతో పవన్ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించారు.